చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్
●డీఎస్పీ ధీరజ్ వినీల్
●ఐదు బైక్‌లు, రెండు బంగారు
చెవిదిద్దులు స్వాధీనం
గుడివాడరూరల్: బైక్‌లు, ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ తెలిపారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం మల్లాయపాలెం టిడ్కో కాలనీ చివరి హెలిప్యాడ్ వద్ద నుంచి వచ్చిన రహస్య సమాచారం మేరకు ఎస్‌ఐ ఎన్.చంటిబాబు, తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారని, ఈ క్రమంలో పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే ఎస్‌ఐ వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. టిడ్కో కాలనీలో ఉంటున్న పెమ్మిశెట్టి రామప్రకాష్(25), నైజాంపేటకు చెందిన అబుబకర్ బేగ్ అలియాస్ అబు(23)లను విచారించగా గుడివాడ లక్ష్మీనగర్ కాలనీ, టిడ్కో కాలనీ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగిన చోరీలను తామే చేసినట్లు విచారణలో అంగీకరించారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, రెండు బంగారు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4.50 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై తెనాలి, చల్లపల్లి, గుడివాడ వన్‌టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జనవరి 2వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో తాలూకా సీఐ ఎస్‌ఎల్‌ఆర్ సోమేశ్వరరావు, ఎస్‌ఐ నంబూరి చంటిబాబు, ట్రైనీ ఎస్‌ఐ టి.లోకేశ్వరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


