 
															ఊపిరిపోయని వెంటిలేటర్లు
వెంటిలేటర్‌పై పెట్టాలంటే ఆందోళన
రెండు వారాల్లో కొత్తవి వస్తున్నాయి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితితో ఉన్న రోగికి ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్ల తీవ్ర కొరత ఏర్పడింది. ఐసీయూలో ఉన్న రోగిని వెంటిలేటర్‌పై పెట్టాలంటేనే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్లు సరిగా పనిచేయక ప్రాణాలుపోతే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రాణ వాయువును అందించే వెంటిలేటర్లను కొనుగోలు చేయాలనే ఆలోచనే చేయడం లేదు. దీంతో నిరుపేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోసారి వెంటిలేటర్ అవసరమైన రోగులు బయట ఆస్పత్రులకు తరలి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
గత ప్రభుత్వంలో కొన్న వాటితోనే...
కోవిడ్ సమయంలో గత ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులకు పెద్ద ఎత్తున వెంటిలేటర్లను సరఫరా చేసింది. అందులో భాగంగా విజయవాడ ఆస్పత్రికి అప్పట్లో 200 వరకూ వెంటిలేటర్లు సమకూరాయి. రెండు విడతల కోవిడ్‌లో ఆ వెంటిలేటర్లు చాలా మందికి ఊపిరిపోశాయి. వాటినే ఇప్పటి వరకూ వినియోగిస్తూ వస్తున్నారు. పనిచేయని కొన్నింటిని పక్కన పెడుతూ ఉన్న వాటితోనే నెట్టుకొస్తున్నారు. క్రమేణా పనిచేసే వెంటిలేటర్లు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్లు చాలడం లేదు. కొంతకాలంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు.
ప్రభుత్వం మొండిచేయి
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వాస్పత్రికి ఆధునిక పరికరాలు అందించిన సందర్భాలు లేదు. గత ప్రభుత్వంలో అన్ని విభాగాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. వాటితోనే వైద్యులు నెట్టు కొస్తున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కొలనోస్కోపీ పరికరం పనిచేయడం లేదు. న్యూరాలజీ విభాగంలో ఈఈఎజీ పరికరం మూలన పడింది. న్యూరోసర్జరీలో ఆధునిక మైక్రోస్కోప్ ఊసే లేదు. హెర్నియాకు ల్యాపరోస్కోపీ సర్జరీలు చేయాలంటే అవసరమైన మెష్‌లు కొనుగోలు చేయడం లేదు. ఇలా అనేక లోపాలున్నా సరిచేయడంతో ప్రభుత్వం నుంచి స్పందన లోపించడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెల కొంది. వెంటిలేటర్లు కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన కొరవడంతో ఆస్పత్రికి వచ్చిన పీజీ గ్రాంట్స్ నుంచి కొనుగోలు చేసే ప్రయత్నాలను ప్రారంభించారు.
ప్రాణాపాయంలో ఉన్న రోగికి ప్రాణవాయువు అందించేందుకు వెంటిలేటర్‌పై పెట్టాలంటే వైద్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వెంటిలేటర్ పనిచేయక మధ్యలో రోగి ప్రాణాలు పోతే పరిస్థితి ఏమిటని వైద్యులు సైతం ఆందోళన చెందిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రిలో చేసే మేజర్ జనరల్ సర్జరీలు, బ్రెయిన్ సర్జరీలు, క్లిష్టతరమైన వాస్క్యులర్ సర్జరీలు, రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రంగా గాయపడిన వారిని, నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శ్యాస తీసుకోలేని సందర్భాల్లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వెంటిలేటర్లు చాలా వరకూ పనిచేయక పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వాటిపై ఉంచిన తర్వాత పనిచేయక రోగి ప్రాణాలు పోతే ఏమిటని ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
విజయవాడ జీజీహెచ్‌లో
వెంటిలేటర్ల కొరత
కోవిడ్ సమయంలో ఇచ్చిన పరికరాలతోనే వైద్య సేవలు
చాలా వరకూ పనిచేయక
మూలకు చేరిన వైనం
ఐసీయూల్లో రోగులకు
వెంటిలేటర్లు లేక ఇక్కట్లు
కొత్తవి కొనాలన్న ఆలోచన చేయని ప్రభుత్వం
కొత్త వెంటిలేటర్లు రెండు వారాల్లో రానున్నాయి. వైద్య కళాశాలకు సంబంధించి డీఎంఈ వద్ద ఉన్న పీజీ గ్రాంట్ నుంచి వెంటిలేటర్లు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ వెంటిలేటర్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. కోవిడ్‌లో వచ్చిన వెంటిలేటర్లలో చాలా వరకూ పక్కన పడేశాం. ఉన్న వాటినే వాడుతున్నాం.
– డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు,
సూపరింటెండెంట్, ప్రభుత్వాస్పత్రి
 
							ఊపిరిపోయని వెంటిలేటర్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
