నష్టపోయిన రైతులందరికీ పరిహారం | - | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులందరికీ పరిహారం

Oct 31 2025 8:22 AM | Updated on Oct 31 2025 8:22 AM

నష్టపోయిన రైతులందరికీ పరిహారం

నష్టపోయిన రైతులందరికీ పరిహారం

కంచికచర్ల: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందుతుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం కీసరలో మునేరు వంతెన వద్ద గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబుతో కలసి వరద ఉధృతిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. కృష్ణానది, మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు వాగుల్లో వరద ప్రవాహంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. మున్నేరుకు అటు, ఇటు ఉన్న 40 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కూడా ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. పంట నష్టాల తుది అంచనాల నివేదికలకు అనుగుణంగా బాధిత రైతులు అందరికీ పరిహారం అందిస్తామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. కృష్ణా నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నరసింహారావు, ఎంపీ డీఓ డి.వెంకటేశ్వరరావు, రూరల్‌ సీఐ చవాన్‌, ఆర్‌ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement