ఇంతటి నిర్లక్ష్యం ఎప్పుడూ చూడలేదు
●పేదల సంజీవని ఆరోగ్యశ్రీపై కక్ష తగదు
● వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదలకు సంజీవనిగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తోందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విమర్శించారు. నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రారంభించి 19 ఏళ్లు అయ్యిందని, ఏనాడు నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇంత కఠిన పరిస్థితులు ఎదుర్కోలేదని ఆయన పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలు, పేదలకు వైద్యసేవల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేదన్నారు. ఆరోగ్య శ్రీ మొదలైన తర్వాత తొలిసారి బిల్లుల కోసం నెట్‌వర్క్ ఆస్పత్రులు ఏకంగా ధర్నాకు సిద్ధమవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.
వారికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే..
కేవలం 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, రాష్ట్రంలోని 95 శాతం మంది పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న ఆరోగ్యశ్రీకి రూ. 3వేల కోట్లు కట్టలేదా అని ప్రశ్నించారు. రూ. 5వేల కోట్లు ఖర్చు చేసి పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా అని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు మంచిపేరు వస్తుందని ఆరోశ్రీని ఆపేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కో నెట్‌వర్క్ ఆస్పత్రికి రూ. 2కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకూ బకాయిలు పెట్టారని వివరించారు.


