దసరా ఆర్జిత సేవల్లో కోతలు | - | Sakshi
Sakshi News home page

దసరా ఆర్జిత సేవల్లో కోతలు

Sep 6 2025 7:14 AM | Updated on Sep 6 2025 7:14 AM

దసరా ఆర్జిత సేవల్లో కోతలు

దసరా ఆర్జిత సేవల్లో కోతలు

వీఐపీల సేవలో దేవదాయశాఖ

రోజులో అన్ని సేవలకు

300 టికెట్లు మాత్రమే

గతంలో డిమాండ్‌ మేరకు

ఎన్ని టికెట్లు అయినా..

రూ. 500 టికెట్‌ విక్రయాల

రద్దుకు నిర్ణయం

ప్రొటోకాల్‌, ప్రముఖులకే

అంతరాలయ దర్శనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అనుకున్నదే.. అయింది.. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఉభయదాతలను పరిమితంగానే అనుమతించాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన రెండో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవదాయ శాఖలో ఒక అధికారి తొలి నుంచి పట్టుబట్టిన విధంగానే ఉత్సవాల్లో జరిగే ఆర్జిత సేవలకు పరిమితంగానే టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. మరో వైపున పరోక్ష సేవలు జరిపించుకునేలా ఆర్జిత సేవా టికెట్ల ధరలను తగ్గించాలని దేవస్థానం భావిస్తోంది. 15 రోజుల్లో ఉత్సవాలు మొదలుకానున్నా ఇప్పటి వరకు ఆర్జిత సేవా టికెట్లను ప్రారంభించకపోవడం దుర్గగుడి చరిత్రలో ఇదే తొలిసారి.

రెండు షిప్టులకు 150 టికెట్లు

దసరాల్లో ప్రత్యేక కుంకుమార్చనను జరిపించుకునేందుకు ఉభయదాతలు, భక్తులు పోటీ పడుతుంటారు. ముఖ్యంగా మూలానక్షత్రం, విజయదశమి రోజున కుంకుమార్చన, చండీహోమానికి అధిక డిమాండ్‌ ఉండేది. భక్తుల డిమాండ్‌ను బట్టి ఎన్ని టికెట్లు అయినా విక్రయించే వెసులుబాటు ఉండేది. ఈ ఏడాది ఆర్జిత సేవల టికెట్లకు పరిమితి విధించడంతో ప్రత్యేక కుంకుమార్చనకు ఒక్కో షిప్టుకు 75 చొప్పున మొత్తం 150 టికెట్లు, ప్రత్యేక చండీహోమానికి 75, ఖడ్గమాలార్చనకు 50, శ్రీచక్రనవార్చనకు 25 టికెట్లు విక్రయించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. రోజుకు మొత్తంగా 300, 11 రోజుల ఉత్సవాలలో 3,300 టికెట్లను మాత్రమే విక్రయానికి రంగం సిద్ధం చేశారు. శని, ఆదివారాల నుంచి ఆయా సేవా టికెట్లు భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

వారికే అంతరాలయ దర్శనం

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది దసరాలో కావాల్సిన వారికి రాచమార్గంలో దర్శనాలు చేయించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేయడంతో పాటు రూ. 500 టికెట్ల విక్రయించకుండా దేవదాయ శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300 టికెట్లు మాత్రమే విక్రయించాలని, ఈ టికెట్‌పై బంగారు వాకిలి, ముఖ మండప దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులు, ప్రొటోకాల్‌ ఉన్న వారికి మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని నిర్ణయించారు.

ఆర్జిత సేవల్లో పరిమితి, రూ.500 దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేయడంతో దేవస్థాన ఆదాయానికి భారీ గండి పడనుంది. గతేడాది ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ. కోటి మేర ఆదాయం సమకూరింది. రూ. 500 టికెట్ల విక్రయాలతో రూ. 2 కోట్ల మేర ఆదాయం రాగా ఈ ఏడాది ఆదాయం పూర్తిగా నిలిచిపోగా, ఆర్జిత సేవల ద్వారా మరో రూ. 50 లక్షల మేర గండి పడే అవకాశం ఉంది. మొత్తంగా ఆలయానికి వచ్చే ఆదాయ మార్గాలను వదిలి, ప్రముఖులు, వీఐపీల సేవలో తరలించేందుకు దేవదాయ శాఖ సిద్ధమైంది. ఉత్సవాల్లో అమ్మవారికి సేవ చేసినందుకు పలు శాఖలకు దేవస్థానం భారీగా డబ్బులు చెల్లిస్తుంది. ముఖ్యంగా నగర పోలీసు శాఖకు రూ. 1.40 కోట్లు, ఇరిగేషన్‌కు రూ. 80 లక్షలు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అంటూ లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అమ్మవారి ఆదాయానికి గండికొడుతున్న అధికారులు.. తమ శాఖకు చెందినవారికి రాచమర్యాదలతో అమ్మ దర్శనం ఆటంకం లేకుండా ఉండటానికి శ్రద్ధ పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement