
అక్రమ లే అవుట్లు ధ్వంసం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ శివారు ప్రాంతంలో ఏర్పాటైన అనధికార లేఅవుట్లపై కార్పొరేషన్ అధికారులు కన్నెర్ర చేశారు. ‘పంచుకో.. దోచుకో’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. కండ్రిక – రామవరప్పాడు రహదారిలో 3.90 ఎకరాల్లో ఏర్పాటైన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతకు సంబంధించిన అనధికార లేఅవుట్‌లో ఉన్న మట్టిని జేసీబీతో తొలగించి, రోడ్లను ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మరో లే అవుట్ చుట్టూ నిర్మించిన గోడను కూల్చి వేశారు. లేఅవుట్‌ను చదును చేశారు. ప్లాన్‌లు లేకుండా నిర్మించిన అక్రమ భవనాలు, అదనపు అంతస్తులపై దృష్టి సారించి భవన యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వసూళ్లకు పాల్పడిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత కలెక్షన్ ఏజెంటు ‘మామ్మూల్యాద్రి’ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
విచారణ చేస్తున్నాం
అనధికార లేఅవుట్లు, అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అదనపు అంతస్తులపై దృష్టి సారించి సిబ్బందితో విచారణ చేయిస్తున్నామని వీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పన్నారు. బాధ్యులైన సిబ్బందిపైనా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అక్రమ లే అవుట్లు ధ్వంసం