
వాహనచోదకుడి మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నడిరోడ్డుపై వాహనచోదకుడు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెస్ట్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని వేపచెట్టు ప్రాంతానికి చెందిన కొప్పుల పద్మ, తిరుపతిరావు(40) భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. తిరుపతిరావు చికెన్ షాపు నడుపుతుంటాడు. నున్నలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో శనివారం తిరుపతిరావు హాజరయ్యాడు. ఆ తర్వాత తిరుపతిరావు తన మోపెడ్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. వెస్ట్ బైపాస్ రోడ్డులో పాతపాడు సమీపానికి వచ్చే సరికి తాను వాహనం నడపలేకపోతున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన పద్మ, తన కుమారులకు విషయం చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తిరుపతిరావు అపస్మారక స్థితిలో ఉండటంతో పద్మ 108కు ఫోన్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది తిరుపతిరావును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తిరుపతిరావు కాలు విరిగిపోయి ఉండటంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
రేపూడిలో వ్యక్తి హత్య
తిరువూరు: ఎ.కొండూరు మండలం రేపూడి శివారు మామిడితోటలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రెడ్డిగూడెం మండలం పాత మద్దులపర్వకు చెందిన కోట రాము(46) మృతదేహంగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం అదృశ్యమై మామిడితోటలో శవమై కనిపించిన రాము వివాహితుడు. అతనికి ఇద్దరు సంతానం. కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధమే రాము హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తిరువూరు సీఐ గిరిబాబు తెలిపారు.
తృటిలో తప్పిన పెను ప్రమాదం
నిడుమోలు సెంటర్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ప్రయివేట్ బస్సు
నిడుమోలు(మొవ్వ): త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై మొవ్వ మండలంలోని నిడుమోలు సెంటర్ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి మచిలీ పట్నం మీదుగా వెళ్తున్న ఎన్‌ఎల్. 07 0847 నంబర్ ప్రైవేట్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విజయవాడ వరకు ఒక డ్రైవరు నడపగా విజయవాడలో డ్యూటీ ఎక్కిన బస్సు డ్రైవర్ రాజకుమార్ పాత చెక్ పోస్ట్ ప్రాంతానికి రాగానే నిద్రమత్తులో కళ్లు మూయడంతో ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 31 మంది ప్రయాణికులు, డ్రైవర్ సురక్షితంగా ఉన్నారు. ఆ సమయంలో ఎలాంటి జనసంచారం, ట్రాఫిక్ కానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో బస్సు ముందు బాగా పూర్తిగా దెబ్బతినగా రెండు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. భారీగా శబ్దం రావడంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న కూచిపూడి ఎస్‌ఐ కే ఎన్ విశ్వనాథ్ సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. సమాచారం తెలియడంతో విద్యుత్ శాఖ మొవ్వ ఏఈ రమేష్, శ్రీహరి సిబ్బందితో తరలి వచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు తీసుకున్నారు.

వాహనచోదకుడి మృతి