
● 8 మందికి గాయాలు
బొలెరోను ఢీకొట్టిన కారు●
రెబ్బెన: మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై బొలెరోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. సిర్పూర్ (టి) రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న సాగర్ సోమవారం విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భార్య అరుణ, కుమారులు విశ్వక్‌రాజ్, విహాన్ రాజ్‌లతో కలిసి బొలెరో వాహనంలో బయలుదేరాడు. రెబ్బెన మండల పరిధిలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో రెడిమిక్స్ ప్లాంట్ వద్దకు చేరుకోగా రెబ్బెన వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్‌కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న సాగర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్ సంతోష్‌కు, షిప్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాగర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను రెబ్బెన పీహెచ్‌సీ తరలించి ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. సాగర్ సోదరుడు రజినికాంత్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వినాయక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.