
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
పెంచికల్‌పేట్(సిర్పూర్): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బొంబాయిగూడ, ఎల్కపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సదస్సులను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సదస్సుల్లో రైతులు సమర్పించే దరఖాస్తులను నమోదు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ ఎల్కపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యాన్ని వేగంగా రైస్ మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. ఆయన వెంట కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు ఉన్నారు.
బాధితులకు అండగా భరోసా కేంద్రాలు
ఆసిఫాబాద్‌రూరల్: లైంగిక దాడి బాధితులకు జిల్లా భరోసా కేంద్రాలు అండగా ఉంటూ సేవలందిస్తున్నాయని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా ఎనిమిది మంది బాధిత మహిళలకు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున చెక్కులు అందించారు. లైంగిక దాడికి గురైన మహిళలతోపాటు బాలికలకు భరోసా కేంద్రాల సిబ్బంది అండగా నిలుస్తున్నారన్నారు. బాధితులకు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తున్నామని, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధితులు 87126 70561 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్, భరోసా సెంటర్ ఇన్‌చార్జి ఎస్సైలు తిరుమల, శైలజ, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్ పాల్గొన్నారు.