
ఎల్‌సీకి సాంకేతికత!
● విద్యుత్ ప్రమాదాల నివారణకు యాప్ ● ఇక ఆన్‌లైన్‌లో విద్యుత్ లైన్ క్లియరెన్స్ ● అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్‌పీడీసీఎల్ ● యాప్‌పై అధికారులు, ఉద్యోగులకు శిక్షణ పూర్తి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యుత్ విని యోగదారులకు మరింతగా మెరుగైన, నాణ్య మైన సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్‌పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభిస్తోంది. ఇందులో భాగంగా విద్యుల్ లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్‌కాల్ ద్వారా ఎల్‌సీ తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలతో పాటు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎల్‌సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ)తీసుకోవడానికి ఎన్‌పీడీసీఎల్ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్‌సీ తీసుకుంటే తీసుకున్న ఉద్యోగికి, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు మాత్రమే తెలి సేది. కానీ యాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో ఎల్‌సీపై అందరి పర్యవేక్షణ కొనసాగుతుంది.
అమలు ఇలా..
ఎల్‌సీ తీసుకోవాలనుకునే లైన్‌మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఏఈకి విన్నవించుకుంటే ఏఈ పరిశీలించి ఫీడర్‌లో ఎల్‌సీ ఇవ్వడానికి వీలు ఉందా లేదా అని పరిశీలించి అనుమతి ఇస్తారు. ఏఈ అనుమతి మేరకు లైన్‌మెన్, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా యాప్‌లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్‌లో ఎల్‌సీ ఇస్తారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ పనులు బాధ్యతగా జరుగుతాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా యాప్ తగు సూచనలు ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్‌లు పెట్టుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా వంటి జాగ్రత్తలు యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడరింగ్ ఉందా..? ఈ ఫీడర్‌కు వేరే ఫీడర్‌తో అనుసంధానం ఉందా..? వంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్‌సీ తీసుకోవడమా..? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవచ్చా..? అని సంయమనం చేసుకుని సిబ్బంది పనులు పూర్తి చేస్తారు. ఎల్‌సీ తీసుకున్న ఫీడర్‌లో పని కాగానే సంబంధిత లైన్‌మెన్ యాప్‌లో ఆ సమాచారాన్ని పొందుపరచి విద్యు త్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు చేరవేస్తారు. దీంతో ఎల్‌సీ తీసుకున్న ఫీడర్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.
అనవసర ఎల్‌సీలకు చెక్
విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంతో పాటు భద్రతా ప్రమాణాలు పెంచడానికి ఎన్‌పీడీసీఎల్ ఎల్‌సీ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. యాప్‌తో ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది. ఏ లైన్‌పై పనులు జరుగుతున్నాయో కూడా సులభంగా తెలుస్తోంది. మొత్తంగా అనవసర ఎల్‌సీలు తగ్గుతాయి. యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాలు, మానవ తప్పిదాలు, విద్యుత్ ప్రమాదాల నివారించవచ్చు.
– గంగాధర్, ఎస్‌ఈ, మంచిర్యాల

ఎల్‌సీకి సాంకేతికత!