
బెబ్బులికి ఆ ఊరే అడ్డు!
సిర్పూర్(టి): మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం నుంచి జిల్లాలోకి పులుల రాకకు సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో ఉన్న అటవీ గ్రామం ఇటిక్యాల పహాడ్ అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలో పులుల సంచారానికి అవాంతరాలు తొలగించేందుకు జిల్లా అటవీశాఖ చర్యలు చేపట్టింది. మనుషుల అలికిడిని తగ్గించి అడవుల పెంపకంతోపాటు వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపడుతోంది. పులుల సంరక్షణ చర్యల్లో భాగంగా ఇటిక్యాల పహాడ్ గ్రామాన్ని సైతం అడవి నుంచి తరలించేందుకు కసరత్తు చేస్తోంది. గ్రామాన్ని పూర్తిగా అటవీ ప్రాంతం నుంచి తరలిస్తే కాగజ్‌నగర్ డివిజన్‌తోపాటు కవ్వాల్ అభయారణ్యానికి పెద్దపులుల సంచారం పెరుగుతుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు.
పూర్తిగా అటవీ ప్రాంతంలో గ్రామం
సిర్పూర్(టి) మండలంలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం పూర్తిగా అటవీ ప్రాంతంలోనే ఉంది. సుమారు 40 ఏళ్ల క్రితం వంద కుటుంబాలతో గ్రామం ఏర్పడింది. ప్రస్తుతం 200 కుటుంబాలు ఉన్నాయి. 550 జనాభా ఉండగా 413 మంది ఓటర్లు ఉన్నారు. స్థానికులు పూర్తిగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరందరూ గిరిజనేతరులు. అటవీశాఖ పరిధిలోని భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం.. రెవెన్యూ గ్రామంగా ఇటిక్యాల పహాడ్‌కు సంబంధించిన సమాచారం రికార్డుల్లో లేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2018లో ఇటిక్యాల పహాడ్ గ్రామాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయినా అటవీ భూములు కావడంతో ఇక్కడ ఇప్పటివరకు పల్లె ప్రగతి పనుల్లో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డు, శ్మశనవాటికలు ఏర్పాటు చేయలేదు.
పునరావాసంపై ఊగిసలాట!
దట్టమైన అడవుల్లో ఉన్న ఇటిక్యాల పహాడ్ గ్రామాన్ని తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే గ్రామం పూర్తిగా అటవీప్రాంతంలో ఉండటం, ప్రజలు గిరిజనేతరులు కావడంతో పునరావాసం కోసం ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రామంలోని 200 కుటుంబాల్లో చాలా వరకు వలస వచ్చిన వారు ఉన్నారని తెలుస్తోంది. ముందు నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వారికి పరిహారం, పునరావాసం కల్పించేందుకు ఆస్కారం ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన హామీల మేరకు ప్రతీ కుటుంబానికి ఐదెకరాల వ్యవసాయ భూమి, ఉండేందుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న తమకు ప్రభుత్వం ప్రత్యేకంగా భూములు కేటా యించి పక్కాగా పట్టాలు ఇచ్చి, మౌలిక సదుపాయాలు కల్పించాలని వేడుకుంటున్నారు.
తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు అడవిలో ఇటిక్యాల పహాడ్..
తాడోబా నుంచి జిల్లాలోకి పులుల ప్రవేశానికి ఇదే కీలక మార్గం
గ్రామాన్ని తరలించేందుకు అటవీశాఖ కసరత్తు
ఇప్పటికే 200 హెక్టార్ల భూమిలో ప్లాంటేషన్ ఏర్పాటు
గిరిజనేతరులు కావడంతో పునరావాసం కల్పనపై తర్జనభర్జన
ఆవాస యోగ్యంగా మార్చడమే లక్ష్యం..
నాలుగేళ్లుగా ఇటిక్యాల పహాడ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణుల రక్షణ చర్యల్లో భాగంగా నీటి కుంటలు, సోలార్ పీటీలు వంటివి ఏర్పాటు చేశారు. ప్లాంటేషన్లు ఏర్పాటు చేసి విస్తృతంగా మొక్కలు పెంచుతున్నారు. నిత్యం పెద్ద పులుల రాకపోకలపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టైగర్ కారిడార్‌కు అనుకూలంగా ఉండటంతో గ్రామస్తులతో అధికారులు గతంలో పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పులుల సంరక్షణకు సహకరించాలని అవగాహన కల్పించారు. 2020 నుంచి అటవీ భూమిని సాగు చేయొద్దని గ్రామస్తులకు సూచిస్తున్నారు. 160 హెక్టార్ల సాగు భూములతోపాటు ఎడారిగా మారిన ఇసుక ప్రాంతాలు సుమారు 200 హెక్టార్లను స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 600 హెక్టార్లను స్వాధీనం చేసుకుని టైగర్ కారిడార్‌గా ఏర్పాటు చేయడమే లక్ష్యమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
గ్రామస్తులు సహకరించాలి
సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉంది. తెలంగాణ– మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతం టైగర్ కారిడార్‌గా మారింది. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి పెద్దపులుల రాకపోకలు ఇదే ప్రాంతం గుండా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాలను పులులకు ఆవాస యోగ్యంగా మార్చేందుకు చర్యలు చేపట్టాం. ఈ సంవత్సరం 200 హెక్టార్ల భూమిని సేకరించి ప్లాంటేషన్ ఏర్పాటు చేయనున్నాం. గ్రామస్తులు ఫారెస్టు అధికారులకు సహకరించాలి.
– పూర్ణచందర్, ఎఫ్‌ఆర్‌వో, సిర్పూర్(టి)

బెబ్బులికి ఆ ఊరే అడ్డు!