కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొరత.. కాంటాల్లో ఆలస్యం ఆపై అదనపు చెల్లింపులకు ఒప్పుకుంటేనే లారీలు సొసైటీకి రోజుకు 2వేల క్వింటాళ్ల నిబంధనతో మరింత సమస్య
అడ్డంకులు..
ముదిగొండ
సొసైటీలో
ఆన్‌లైన్ కోసం
వేచి ఉన్న రైతులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొనుగోళ్లలో జాప్యం, అడుగడుగునా సమస్యలతో మొక్కజొన్న ఎందుకు సాగు చేశామా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత మొదలు గోదాంకు తరలించే వరకు ఎదురవుతున్న అడ్డంకులు వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవి ఇలా కొనసాగుతుండగానే ప్రభుత్వం తాజాగా ఒక సొసైటీ రోజుకు 2వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పినట్లు తెలుస్తుండడం గుదిబండలా మారనుంది. వీటన్నింటికీ తోడు కౌలు రైతులను ఆన్‌లైన్ సమస్య వేధిస్తోంది.
ఆన్‌లైన్‌లో జాప్యం
ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఎకరానికి 40 – 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1,700కు మించి ధర పెట్టలేదు. దీంతో ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు సిద్ధమైంది. ఇక అడపాదడపా కురిసిన అకాల వర్షాలతో మొక్కజొన్న పంట కిందకు వాలింది. దీంతో కింద పడ్డ కంకులు మిషన్‌తో కోయడం సాధ్యం కాక కూలీల రూపంలో అదనపు భారం పడింది. ఆపై పంట అమ్ముకునేందుకు వెళ్తే సకాలంలో ఆన్‌లైన్ కాక రైతులు రోజుల తరబడి వేచి ఉంటున్నారు. ఇక కౌలు రైతులు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డుతో వెళ్లి ఏఈఓ దగ్గర ధ్రువపత్రం తీసుకున్నాక ఆన్‌లైన్‌లో డీఎం అనుమతి తీసుకోవాలి. ఆతర్వాత సొసైటీలో వేలిముద్ర వేయడానికి చాలా సమయం పడుతోంది. సర్వర్ మొరాయిస్తుండడంతో జాప్యం జరుగుతుండగా.. కొన్నిచోట్ల ఏఈఓలు చేసిన క్రాప్ బుకింగ్, క్షేత్రస్థాయి పంటకు తేడా రావడంతో ఇబ్బంది పడుతున్నారు.
కాంటాలు కాక.. లారీలు లేక..
కొనుగోలు కేంద్రాలకు మక్కలు తీసుకొచ్చిన రైతులు కాంటాల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. గన్నీ బ్యాగ్‌లు ఇవ్వకపోవడంతో రైతులే రూ.26 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల కల్లాల్లో మొక్కజొన్నలను నిల్వ చేయగా.. ఎండ వేడికి నిప్పంటుకుంటోంది. ఇలాగే బోనకల్, చింతకాని మండలాల్లో పంట అగ్నికి ఆహుతైంది. మరోపక్క లారీల కొరతతో గోదాంలకు తరలింపులో జాప్యం జరుగుతోంది. స్థానికంగా గోదాంలకై తే టన్నుకు రూ.450, సూర్యాపేటలోని గోదాంలకు రూ.500 నుంచి రూ.550 మాత్రమే లారీలకు ఇస్తున్నారు. కానీ అన్‌లోడ్ చేయడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో లోడ్‌కు రూ.16వేలే వేస్తున్నాయంటూ లారీల యాజమానులు ముందుకు రావడం లేదు. క్వింటాకు రూ.100 నుంచి రూ.120 ఇచ్చే రైతుల సరుకు తీసుకెళ్తుండగా, అలా ఇవ్వలేని రైతులు పడిగాపులు కాస్తున్నారు.
రెండు వేల క్వింటాళ్లేనట..
మార్క్‌ఫెడ్ తాజాగా కొత్త నిబంధన అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కాంటా అయిన మొక్కజొన్నలను తీసుకెళ్లిన లారీలు రకరకాల కారణాలతో గోదాంల వద్ద నిలిచిపోతున్నాయి. దీంతో ఒక్కో సొసైటీ రోజుకు రెండు వేల క్వింటాళ్లే కొనుగోలు చేయాలనే నిబంధన తీసుకొచ్చినట్లు సమాచారం. అంతవరకే ట్రక్ షీట్లు జారీ చేస్తుండడం రైతులు వేచి ఉంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే విక్రయించిన పంటకు సకాలంలో నగదు జమ కాక రైతులు ఆవేదన చెందుతున్నారు.
మొక్కజొన్న విక్రయానికి రైతుల అవస్థలు


