కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండ పర్యటన అనంతరం మధ్యాహ్నం 2–30 గంటలకు హెలికాప్టర్ ద్వారా వారు నాయకన్‌గూడెం చేరుకుంటారు. తొలుత పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఆతర్వాత 3–30 గంటలకు కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం కానున్న మంత్రులు ధాన్యం కొనుగోలుపై సమీక్షిస్తారు.
ప్రశాంతంగా పాలిసెట్
ఖమ్మం సహకారనగర్/మధిర: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఖమ్మంలో ఆరు కేంద్రాలు ఏర్పాటుచేయగా 3,157 మంది విద్యార్థులకు గాను 2,902 మంది హాజరయ్యారని పరీక్షల నగర కోఆర్డినేటర్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షించినట్లు వెల్ల డించారు. అలాగే, మధిరలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 539 మంది విద్యార్థులకు గాను 496 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ కె.సాంబయ్య తెలిపారు.
ప్రారంభమైన ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం నిర్వహించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాక లోపలికి అనుమతించగా, కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 4,072 మందికి 3,821 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,039 మందిలో 941మంది హాజరయ్యారని అధికారులు తెలి పారు. కాగా, ఉదయం 20 సెంటర్లలో, మధ్యాహ్నం 16 సెంటర్లలో పరీక్షల కన్వీనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు డీఐఈఓ రవిబాబు తనిఖీ చేశారు.
బక్రీద్ ప్రశాంతంగా
జరుపుకునేలా పర్యవేక్షణ
ఖమ్మంక్రైం: బక్రీద్ పండుగను ప్రశాంత వాతా వరణంలో జరుపుకునేలా వివిధ శాఖల అధి కారులు పర్యవేక్షించాలని డీజీపీ సీవీ.ఆనంద్ సూచించారు. పోలీసు, పశుసంవర్ధక, రెవె న్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం మాట్లాడారు. జిల్లా నుంచి పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ గోవధ, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. పశువైద్యుల ధ్రువీకరణ లేకుండా జంతువులను రవాణా చేస్తే జప్తు చేస్తున్నామని చెప్పారు. అంతేకాక పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయగా, ఇప్పటికే గోరక్షక కమిటీలు, ముస్లిం మతపెద్దలతో సమావేశమై సూచనలు చేశామని తెలిపారు. ఇంకా ఈ వీసీలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, సారంగపాణి, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.


