వరి మడులను ముంచెత్తిన నీరు
ఖరీఫ్‌లో వానలు ఆలస్యమైతే
రైతులకు ఇక్కట్లు
కల్లూరురూరల్: చెరువుల నిండా నీరు ఉండడంతో వచ్చే సీజన్‌లో వర్షాలు ఆలస్యమైనా సాగుకు డోకా ఉండదని రైతులు ఆశతో ఉన్నారు. కానీ, కొందరు చెరువులోవేట కష్టంగా మారిందని తూములు పగలగొట్టి నీటిని బయటకు వృథాగా పంపిన వైనమిది. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి, వేంపల్లి చెరువులో చేపలు పెంచతున్న వ్యాపారులు నీళ్లు నిండుగా ఉండడం వేట ఆలస్యమవుతోందని భావించినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రాత్రి తూములు పగలగొట్టి పక్కనే ఉన్న వరిమడుల్లోకి నీరు వదిలిపెట్టారు. ఫలితంగా ఆయకట్టు పరిధిలోకి చేరిన నీటిని బుధవారం ఉదయం రైతులు గుర్తించి సమాచారం ఇవ్వగా జల వనరుల శాఖ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ చేరుకుని అడుకట్ట వేయించారు. వరి మడులు నీటితో నిండడంతో దుక్కులు దున్నే అవకాశం లేదని, ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, తూములు పగలగొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొణిజర్ల మండలంలో...
కొణిజర్ల: చేపల వేట కోసం కొందరు చెరువులో నీరు ఖాళీ చేస్తున్నారు. కొణిజర్లలోని ఊర చెరువు, చీకటి చెరువులో రెండు రోజులుగా రెండు తూముల ద్వారా భారీగా నీరు బయటకు పంపిస్తున్నారు. ఏటా చేపల వేట కోసం చెరువులో నీటిని వృథా చేస్తున్నా ఒకరిద్దరు రైతులు మినహా అటు ప్రజాప్రతినిధులు కానీ, జలవనరుల శాఖ అఽధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వేసవిలో పశువులకు తాగునీరు, వానాకాలంలో రైతులు నార్లు పోసుకునేందుకు చెరువులో నీరు ఉండాలి. కానీ చేపల వేటగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా రాత్రివేళ తూములు తెరిచి నీళ్లు బయటకు వదులుతున్నారు. ఫలితంగా చెరువులు ఖాళీ కావడమే కాక నీరు వృథాగా పొలాల్లోకి, ఏటిలోకి చేరుతోంది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చెరువులు ఖాళీ చేయకుండా పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు.


