జిల్లా రిజర్వాయర్లలో గరిష్ట నీటిమట్టం, ప్రస్తుత నిల్వలు (అడుగుల్లో)
జిల్లా నీటివనరుల్లో సంతృప్తికరంగా జలాలు
తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు
దాదాపు సగం చెరువుల్లో పూర్తిస్థాయి జలకళ
అయినా సకాలంలో వర్షాలు కురిస్తేనే సజావుగా సాగు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గత నెలాఖరు నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అడపాదడపా జల్లులు మినహా అకాల వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది. అయినా జిల్లాలోని ప్రధాన చెరువులు, రిజర్వాయర్లలో ప్రస్తుతానికి నీటిమట్టం సంతృప్తికరంగానే ఉంది. కానీ రాబోయే వానాకాలం సాగు మొత్తం నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉండడం.. రుతుపవనాల రాక ఆలస్యమవుతుందనే ప్రచారం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు నిండితేనే సాగు సాఫీగా సాగనుంది.
భయపెడుతున్న భానుడు
ఎండాకాలం ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం వానాకాలం సాగుపై పడుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో ఉన్నా పంటల సాగుకు బోర్లు, బావులపై పెద్దసంఖ్యలో రైతులు ఆధారపడతారు. ఎండలకు తోడు వర్షాలు ఆలస్యమై భూగర్భ జలాలు మరింత తగ్గితే నీరు అందని పరిస్థితి ఎదురవుతుంది.
మండువేసవిలో జలకళ
జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లలో వేసవిలోనూ నీటినిల్వలు ఉండటం విశేషం. ప్రధానంగా సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చి చేరే నీటితో పాలేరు రిజర్వాయర్ కళ సంతరించుకుంది. ఈ రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 19.45 అడుగుల మేర నీరు ఉంది. వైరా మధ్య తరహా ప్రాజెక్టు, జాలిముడి ప్రాజెక్టుల్లోనూ నీరు ఉండగా.. లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి చెరువు, కట్టలేరులో కొంత మేర తగ్గింది.
463 చెరువులు నిండా..
జిల్లాలో 962 చెరువులు ఉండగా.. అందులో 463 చెరువుల్లో 75 శాతం నుంచి 100శాతం నీరు ఉంది. కేవలం 233 చెరువుల్లోనే 25 శాతం లోపు నీటి నిల్వ లు ఉన్నాయి. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో నీటి వనరులు నిలకడగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో 87 చెరువుల్లో 50 – 75 శాతం మేరకు నీరు ఉండటం సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఎండలు మరింత ముదిరితే ఇంకొన్ని చెరువుల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. రానున్న వానాకాలం సీజన్ వరకు ఈ నిల్వలు తగ్గకపోతే పంటల సాగుకు ఉపయుక్తం కానున్నాయి.
వర్షాలపైనే ఆధారం..
జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు కొత్త ఆశలను కల్పిస్తున్నా.. రానున్న వానాకాలం సీజన్ సజావుగా సాగాలంటే వరుణుడి కరుణ తప్పనిసరి. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వానాకాలం సాగుపై నీలినీడలు కమ్ముకుంటాయి. రుతుపవనాలు బలహీన పడి సకాలంలో వర్షాలు కురవకపోతే వ్యవసాయంపై ప్రభావం పడుతుంది. అలాకాకుండా ప్రస్తుతం చెరువులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలకు తోడు జూన్ రెండు, మూడో వారాల్లో వర్షాలు కురిసి జలాశయాలు నిండితేనే సాగు గాడిన పడనుంది.
ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుత నిల్వలు
పాలేరు రిజర్వాయర్ 23 19.45
వైరా రిజర్వాయర్ 18.03 14.04
లంకాసాగర్ ప్రాజెక్టు 16 05.05
బేతుపల్లి చెరువు 16 08.03
జాలిముడి ప్రాజెక్టు 15 15.01


