పారదర్శకంగా రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా రీ సర్వే

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ● కాకరవాయిలో సర్వే పరిశీలన.. ఉద్యోగులకు సూచనలు

సాఫీగా మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ● కాకరవాయిలో సర్వే పరిశీలన.. ఉద్యోగులకు సూచనలు

తిరుమలాయపాలెం: భూముల రీ సర్వేను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో రీ సర్వే ప్రక్రియను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. గ్రామంలో ఆర్‌ఎస్‌ఆర్‌ పట్టా విస్తీర్ణం సమస్యల పరిష్కారానికి రీ సర్వే చేపడుతుండగా.. ఆతర్వాత కచ్చితంగా వివరాలు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఐదు బృందాల ద్వారా చేపడుతున్న సర్వే వివరాలను రైతు వేదికలోనే కంప్యూటర్‌ ఏర్పాటు చేసి నమోదు చేయాలని సూచించారు. గ్రామంలోని అన్ని రహదారులు, ప్రజాస్థలాలు, ప్రభుత్వ భూములను కచ్చితమైన వివరాలతో గుర్తించాలని చెప్పారు. ఐదు బృందాలు కలిపి రోజుకు 250 – 300 ఎకరాలు సర్వే చేయాలని తెలిపారు. ఈ సర్వేతో ఎవరికీ నష్టం జరగకపోగా, సర్వే నంబర్లలో గందరగోళం తొలగిపోతుందని వివరించారు. ఆర్డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ విల్సన్‌, ఎంపీడిఓ సిలార్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

వానాకాలానికి ముందే రైతు రిజిస్ట్రీ

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్‌కు ముందే రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, రవాణా శాఖ, సీడ్‌ కార్పొరేషన్‌, పోలీసు శాఖలు సమన్వయంతో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా నిలువరించాలని తెలిపారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ బందాల ద్వారా నిరంతరం తనిఖీ చేయాలని చెప్పారు. అలాగే, క్రాప్‌ బుకింగ్‌, రైతు రిజిస్ట్రీపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సోలార్‌ విలేజ్‌గా రఘునాథపాలెం

రఘునాథపాలెం: పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్‌ రూప్‌టాప్‌ వ్యవస్థ కలిగిన పైలట్‌ గ్రామంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ సూచించారు. రఘునాథపాలెంలో సోలార్‌ మోడల్‌ ప్రాజెక్టు పనులను మంగళవారం తనిఖీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు 110 ఇళ్లపై ప్యానళ్లు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర సామూహిక ప్రదేశాలపైనా సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జనగణన సర్వేపై కలెక్టర్‌ ఆరా తీశారు. విద్యుత్‌ శాఖ డీఈ రామారావు, ఏడీఈ సంజయ్‌కుమార్‌, రెడ్‌కో జిల్లా మేనేజర్‌ పోలిశెట్టి అజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్వేత, సర్పంచ్‌ గాజుల కృష్ణారావు, ఎంపీడీఓ ఆశోక్‌కుమార్‌, ఆర్‌ఐ వహీద్‌, గ్రామ కార్యదర్శి అనురాధ పాల్గొన్నారు.

ఖమ్మంసహకారనగర్‌: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది రాకుండా సాఫీగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావుతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2.78 లక్షల టన్నుల మొక్కజొన్న కేంద్రాలకు చేరగా, కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల జిల్లాఅధికారులు చందన్‌కుమార్‌, శ్రీరామ్‌, డి.పుల్లయ్య, గంగాధర్‌, ఎం.ఏ.అలీం, సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement