ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌గా డాక్టర్ సతీష్‌కుమార్ నియమితులయ్యారు. ఏడాది కాలంగా పోస్టు ఖాళీగా ఉండడంతో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభావం పడుతోంది. ఈనేపథ్యాన సతీష్‌కుమార్‌ను నియమించగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు అర్హులకు సాఫీగా అందేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు ఎదురైతే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
రైతు డిస్కంకు సై!
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా విద్యుత్ సర్వీసుల కోసం రాష్ట్రస్థాయిలో విద్యుత్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన రైతు డిస్కంలోకి వెళ్లేందుకు ఉద్యోగులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) పేరిట నిర్వహిస్తున్న ఈ డిస్కంలో చేరేందుకు ఇతర డిస్కంల ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించగా ఎన్పీడీసీఎల్ పరిధిలో 1,252 మంది ఆసక్తి చూపించారు. ఇందులో ఖమ్మం విద్యుత్ సర్కిల్ నుంచి 80 మంది ఉద్యోగులు ఉన్నారు. ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కూడా దరఖాస్తు చేసుకోగా, నలుగురు డివిజనల్ ఇంజనీర్లు, ఒక ఏడీఈ, ఏడుగురు ఏఈలు ముందుకొచ్చారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే ఖమ్మం రూరల్ డివిజన్ నుంచి అత్యధికంగా 26 మంది, ఖమ్మం టౌన్ డివిజన్‌లో 11 మంది, సత్తుపల్లి డివిజన్‌లో 14 మంది, వైరా డివిజన్‌లో 9 మంది, మధిర డివిజన్‌లో ఆరుగురు రైతు డిస్కంలోకి వెళ్తామని పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించారు.
పదోన్నతులు వస్తాయని..
నూతన డిస్కంలో త్వరగా పదోన్నతి వస్తుందనే భావనతో ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేస్థాయిలో పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే డిస్కంలో చేరితే పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుందనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డిస్కం నిర్వహణకు 2 వేల మంది ఉద్యోగుల అవసరమని భావిస్తుండగా, ఎన్పీడీసీఎల్ నుంచే 1,250 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మిగతా డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయినందున బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయా ఉద్యోగులు 15వ తేదీన ప్రస్తుత స్థానాల్లో రిలీవ్ అయి పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్నాక కొత్త స్థానాల్లో 25వ తేదీలోగా చేరాల్సి ఉంటుంది.
విద్యుత్ సెక్షన్ల విలీనం
పలు ఇంజనీరింగ్ పోస్టులు రద్దు
ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం ప్రత్యేక ఏర్పాటుతో విద్యుత్ సెక్షన్ల విలీనానికి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ, వాటర్ వర్క్స్ కనెక్షన్ల నిర్వహణకు ప్రత్యేకంగా రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఆర్పీడీసీఎల్)ను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని 1,22,757 వ్యవసాయ, 7,912 వాటర్ వర్క్స్ కనెక్షన్లు ఆ డిస్కం పరిధిలోకి వెళ్తాయి. ఫలితంగా టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి ఖమ్మం విద్యుత్ సర్కిల్‌లో సర్వీసుల సంఖ్య తగ్గనుంది. ఈ మేరకు మిగిలిన కనెక్షన్లలో 15 వేలకు ఒకటి చొప్పున సెక్షన్ ఏర్పాటుకు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నిర్ణయంతో రాయుడుపాలెం, వేంసూరును ఒక సెక్షన్‌గా, ఏన్కూరు, తిమ్మారావుపేట కలిపి ఒకటి, బోనకల్, మోటమర్రిని ఒక సెక్షన్‌గా విలీనం చేస్తున్నారు. అంతేకాక ఎస్‌ఈ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఈ, ముదిగొండ ఏడీఈ, విలీనమైన సెక్షన్లలో మూడు ఏఈ పోస్టులు, సబ్ ఇంజనీర్ల పోస్టుల రద్దుకు నివేదికలను సీఎండీకి పంపించారు.


