ఎస్సెస్సీ టాపర్లకు విమానయానం | - | Sakshi
Sakshi News home page

ఎస్సెస్సీ టాపర్లకు విమానయానం

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

బోనకల్‌: పదో తరగతి ఫలితాల్లో మండల ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు విమానయానం కల్పిస్తామన్న ఊటుకూరి ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు తన హామీ నెరవేర్చుకున్నారు. ఈ మేరకు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టి.భానుప్రకాశ్‌ (ఆళ్లపాడు – 560 మార్కులు), టి.చంద్రిక (రావినూతల – 546 మార్కులు)ను విజయవాడ నుంచి హైదరాబాద్‌ వరకు సొంత ఖర్చులతో విమానంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల వెంట ఎంఈఓ దామాల పుల్లయ్య కూడా వెళ్లారు.

పీజీ నాలుగో సెమిస్టర్‌

పరీక్షలు నిరవధిక వాయిదా

కేయూక్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఈ నెల 11న కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యాన మంగళవారం సాయంత్రం విద్యార్థులతో సమావేశం కాగా, పోటీ పరీక్షలు ఉండడమే కాక ఎండల కారణంగా పరీక్షలు వాయిదా వేయాలని పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాక నాలుగో సెమిస్టర్‌ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించామని, ఈ నెల 13న మధ్యాహ్న భోజనం తర్వాత యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తారని వెల్లడించారు. జూన్‌ 8న వేసవి సెలవులు ముగిశాక సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు.

బరువు తగ్గిస్తామనే హామీ విఫలంతో జరిమానా

ఖమ్మంలీగల్‌: బరువు తగ్గిస్తామని నమ్మబలికి రూ.వేలల్లో ఫీజు తీసుకున్నాక సేవల్లో నిర్లక్ష్యం వహించడంతో ఖమ్మంలోని కలర్స్‌ (కలర్స్‌ – సీజే హెల్త్‌, వెల్‌నెస్‌) సంస్థ పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్‌ మంగళవారం తీర్పునిచ్చింది. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం గత్తాయిగూడెంకు చెందిన అట్లూరి తేజశ్రీ ఆరు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిస్తామనే కలర్స్‌ సంస్థ ప్రకటన చూసి సంప్రదించింది. ఈ మేరకు 2024 నవంబర్‌లో రెండు విడతలుగా రూ.2 లక్షలు ఫీజు చెల్లించారు. ఆపై ప్రతీ వారం రామవరం నుంచి ఖమ్మంకు వచ్చివెళ్తూ ఎనిమిది నెలల చికిత్స పొందారు. అయినా బరువులో ఎలాంటి మార్పు రాకపోగా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించినా, లీగల్‌ నోటీసు జారీ చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కలర్స్‌ సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు నిర్ధారణ కావడం, విచారణకు ప్రతినిధులు హాజరుకాకపోవడంతో బాధితురాలు చెల్లించిన రూ.2లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వడమే కాక ఆర్థిక నష్టానికి రూ.20 వేలు, కేసు ఖర్చులుగా రూ.10 వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించకపోతే వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement