కొణిజర్ల: మొక్కజొన్నల కాంటా పూర్తయినా ఎగుమతికి ట్రక్‌షీట్లు ఆన్‌లైన్ చేయకుండా మార్క్‌ఫెడ్ అధికారులు కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు కొణిజర్లలోని ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. మొక్కజొన్నల కాంటా పూర్తయ్యాక ఎగుమతికి మార్క్‌ఫెడ్ అధికారులు ఆన్‌లైన్‌లో ట్రక్‌షీట్ మంజూరు చేయాలి. పట్టాదారు రైతు వేలి ముద్ర వేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం పలు గ్రామాల రైతులు మంగళవారం ఉదయమే సొసైటీ కార్యాలయానికి రాగా, మార్క్‌ఫెడ్ అధికారులు రోజుకు 2 వేల బస్తాల ఎగుమతికే ఆన్‌లైన్ చేశారు. దీంతో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న తమ పరిస్థితి ఏమిటని రైతులు రాస్తారోకోకు దిగారు. ఈ మేరకు సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ అరుణ చేరుకుని మాట్లాడారు. లారీ యజమానులు బస్తాకు రూ.50 తీసుకుంటున్నారని, ట్రక్‌షీట్ జారీ కాక వేచి ఉండాల్సి వస్తే రోజుకు రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు వాపోయారు. దీంతో తహసీల్దార్ అరుణ మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా వారు సర్వర్‌లో మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా ఎండలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
బస్తాల ఎగుమతిలో నిబంధనలపై ఆగ్రహం


