ఇంటింటి సర్వే ఆరంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటి సర్వే ఆరంభం

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

ప్రజలందరూ సహకరించాలి

ఏ ఇంటినీ విడిచిపెట్టొద్దు

తొలి మూడు రోజులు ఇళ్లకు నంబర్లు

ఆతర్వాత ప్రశ్నావళి ఆధారంగా ఇంటింటా సర్వే

జిల్లాలో 30,398 మంది స్వీయగణనలో నమోదు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జనగణనలో కీలక అడుగు పడింది. ఇందులో తొలి దశగా ఇంటింటి గణనకు ఎన్యుమరేటర్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే సిద్ధం చేసిన 2,651 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబాలకు నంబర్లు కేటాయించనున్నారు. ఇదంతా మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఆతర్వాత యాప్‌లోని ప్రశ్నావళి ఆధారంగా ఇంటింటా వివరాలు సేకరించనున్నారు. కాగా, ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. కొణిజర్లలో పరిశీలించి ఎన్యుమరేటర్లకు సూచనలు చేశారు.

రెండు దశల్లో జనగణన..

జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో చేపడుతోంది. మొదటి దశ సోమవారం మొదలు కాగా.. రెండో దశ వచ్చే ఏడాది ఉంటుంది. ప్రస్తుత సర్వేలో తొలుత గృహగణన చేపడతారు. ఒక ప్రాంతంలో ఉన్న నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలను సేకరిస్తారు. వీటికి నంబర్లు కేటాయించి జాబితా తయారు చేస్తారు. అలాగే ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లు(జనాభా గణన బ్లాక్‌లు) కూడా ఏర్పాటవుతాయి. జనగణనను సులువుగా చేపట్టేందుకు నిర్దిష్ట ప్రాంతాలను విభజిస్తారు. పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్నచిన్న భౌగోళిక ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతీ బ్లాక్‌కు నియమించిన గణన అధికారి తమ పరిధిలో ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరిస్తారు. దీన్ని సర్వేలో ప్రాథమిక దశగా పిలుస్తారు. ఇది గురువారం నుంచి జూన్‌ 9వ తేదీ వరకు కొనసాగుతుంది.

స్వీయగణనకు నాలుగో స్థానం

జనగణనలో భాగంగా ప్రజలే సొంతంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ పేరుతో అవకాశం కల్పించింది. గతనెల 26నుంచి ఈనెల 10వ తేదీ వరకు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండగా.. జిల్లాలో 30,398 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారికి ఎస్‌ఈ ఐడీ వస్తుంది. ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఈ నంబర్‌ చూపిస్తే పరిశీలించి.. లోపాలు ఉంటే సరిచేసుకునే వీలు కల్పించారు. తద్వారా ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని చెబుతున్నారు. కాగా, స్వీయ గణనలో రాష్ట్రంలోని మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ఖమ్మం జిల్లా నాలుగో స్థానం దక్కించుకుంది. ఇక గ్రామీణ జిల్లాల్లో పరిశీలిస్తే ఖమ్మం మొదటి స్థానాన నిలవడం విశేషం. స్వీయ గణన వల్ల ఎన్యుమరేటర్లకు పని సులభం కావడంతో పాటు సమయం సైతం ఆదా అవుతుంది.

ఇళ్ల గణన ప్రారంభం

జిల్లాలో సోమవారం నుంచి జనగణన మొదటి దశలో భాగంగా ఇళ్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి మూడు రోజులు ఇళ్ల సంఖ్య లెక్కించి నంబర్లు కేటాయిస్తూ, నాలుగో రోజు నుంచి గృహ సమాచారం, ఆ తర్వాత కుటుంబంలో వినియోగించే ధాన్యం, సదుపాయాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డిజిటల్‌ రూపంలో వివరాలు చేస్తున్నారు. తద్వారా కచ్చితత్వం, పారదర్శక ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం తయారు చేసే ఇళ్ల జాబితా ఆధారంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణనను చేపడతారు.

జనగణనలో తొలిదశ ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం జిల్లాలో మొదలైంది. ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వచ్చి కుటుంబ వివరాలను సేకరిస్తారు. ప్రజలు పూర్తి, సరైన సమాచారాన్ని అందించి సహకరించాలి. ప్రభుత్వ పథకాలు కోల్పోతామనే అపోహలు విడనాడాలి. ప్రజలు ఇచ్చే వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. ఇలా సేకరించే సమాచారం దేశ భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగపడుతుంది. – దివాకర టీఎస్‌, కలెక్టర్‌

కొణిజర్ల: దేశాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో కీలకంగా నిలిచే జనగణన విధులను ఎన్యుమరేటర్లు నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. జిల్లాలో సోమవారం ఇంటింటి గణను కొణిజర్లలో ఆయన పరిశీలించారు. గ్రామంలో మొత్తం 2,600 గృహాలను ప్రాథమికంగా గుర్తించగా, పది బ్లాక్‌లుగా రూపొందించి పది మంది ఎన్యుమరేటర్లను నియమించామని తహసీల్దార్‌ అరుణ తెలిపారు. అనంతరం ఇంటి గణన, నంబర్ల కేటాయింపు వివరాలపై ఎన్యుమరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత ఎస్సీ కాలనీలో గృహ గణనను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్‌.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. తొలుత మల్టీపర్పస్‌ వర్కర్ల ద్వారా ఇంటింటికీ సమాచారం చేరవేస్తే ఎన్యుమరేటర్‌ వెళ్లే సరికి కుటుంబీకులు వివరాలు సిద్ధం చేస్తారని చెప్పారు. తద్వారా పని సులువుగా, త్వరగా పూర్తవుతుందని కలెక్టర్‌ తెలిపారు. సీపీఓ ఏ.శ్రీనివాస్‌, వివిధ శాఖల ఉద్యోగులు శ్రీకాంత్‌, ఆర్‌.ఉపేంద్రయ్య, ఎన్‌.తిరుపతిరావు, రమేష్‌, గురుమూర్తి, రమేష్‌, అరుణాకర్‌, ప్రసాద్‌, హనుమతో పాటు సర్పంచ్‌ గూదె పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.

స్వీయ జనగణన పూర్తి.. గృహ గణన మొదలు

Advertisement
 
Advertisement
Advertisement