పోరాటాలతోనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

● కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ ● బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్‌ విగ్రహం తొలగింపు ● మాస్‌లైన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఠాగూర్‌

● కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ ● బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్‌ విగ్రహం తొలగింపు ● మాస్‌లైన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఠాగూర్‌

ఇల్లెందు: మిలిటెంట్‌ పోరాటాలతోనే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్‌) జాతీయ నాయకుడు ప్రదీప్‌ సింగ్‌ ఠాగూర్‌ అన్నారు. సోమవారం నుంచి ఇల్లెందులో ఏఐయూకేఎస్‌ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. చీలికలుగా మారిన సీపీఐ(ఎంఎల్‌)లోని కొన్ని గ్రూపులు కలిసి మాస్‌లైన్‌గా ఆవిర్భవించాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో 16 రారష్ట్‌రాల్లోని రైతు సంఘాలతో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం సభలను ఇల్లెందులో నిర్వహిస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం సింగరేణి హైస్కూల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని రైతుల నడ్డి విరిచేలా ఇతర దేశాల నుంచి వరి, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తుల దిగుమతికి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. గంభీర ఉపన్యాసాలు దంచే మోదీ ట్రంప్‌ షరతులకు తలొగ్గాడని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ఇక పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్‌ విగ్రహాన్ని తొలగించారని విమర్శించారు. మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ఎన్డీ పార్టీ ప్రతిఘటన పోరాటం అంటూ కేడర్‌ను మోసం చేస్తోందని ఆరోపించారు. జీవితాలను ధారబోసిన మావోయిస్టు పార్టీ కూడా ఆచరణ సాధ్యం కాని విధానంలో పని చేశామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో పీడిత ప్రజల రాజ్యం రావాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయడం లేదన్నారు. రైతులు పడిగాపులు కాస్తున్నా మక్కలు, ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని, ఇల్లెందుకు నీరు ఇవ్వాలని అన్నారు. సభలో అలిండియా కన్వీనర్‌ విమల్‌ త్రివేది, తుమ్మలపల్లి ప్రసాద్‌, కిచ్చెల రంగయ్య, గుమ్మడి నర్సయ్య, కె.రమ, డీహెచ్‌ పూజార్‌, కృష్ణ గగోయ్‌, చండ్ర అరుణ, కృష్ణ, రాము, భిక్షం, నాయిని రాజు, వెంకన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement