ఖమ్మంవైద్యవిభాగం: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 14 ఏళ్లు పూర్తయి 15ఏట కొనసాగుతున్న బాలికలకు ఈ టీకా వేయాలని నిర్ణయించి మార్చి 8వ తేదీన జిల్లాలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఈ వయస్సు బాలికలు 10,883 మంది ఉండగా, సోమవారం నాటికి 5,329 మందికి(49శాతం) వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు 15 పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. తొలుత మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని నిర్దేశించుచుకున్నా, సాధ్యం కాకపోవడంతో సెంటర్ల పెంపునకు నిర్ణయించారు. ఖరీదైన గార్డాసిల్–4 వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉన్న నేపథ్యాన, తల్లిదండ్రులు తమ కుమార్తెలను తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 37 కేంద్రాలు
ఖమ్మంసహకారగనర్: జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 37కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. ఖమ్మం నయాబజార్ కళాశాలలో సోమవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఎండల నేపథ్యాన కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సమకూర్చాలని తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి 5–30 గంటల వరకు జరిగే పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,433 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,562 మంది పరీక్షలు హాజరవుతారని చెప్పారు. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే ప్రిన్సిపాల్ ద్వారా డీఐఈఓ ఆఫీస్‌లో సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. డీఈసీ సభ్యులు ఎం.సింహాచలం, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం సహకారనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిర్వహించే పాలిసెట్ ఈనెల 13వ తేదీ బుధవారం జరగనుండగా, ఏర్పాట్లుచేసినట్లు నగర కోఆర్డినేటర్, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ జాకిరుల్లా తెలిపారు. పరీక్షకు హాజరయ్యే 3,157మంది విద్యార్థుల కోసం ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల, ఎస్‌బీఐటీ, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, దరిపల్లి అనంతరాములు ఇంజినీరింగ్ కళాశాల, డీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని వెల్లడించారు. పరీక్ష బుధవారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను 10 గంటల నుంచే అనుమతిస్తామని వెల్లడించారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు హెచ్‌బీ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకురావాలని సూచించారు.
కేంద్రాల వద్ద 163 సెక్షన్
ఖమ్మంక్రైం: పాలిసెట్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సునీల్‌దత్ తెలి పారు. ఉదయం 9నుంచి మధ్నాహ్నం 3–30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనుండగా, కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. సభలు, ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
13,14వ తేదీల్లో ప్రజాదర్బార్
ఖమ్మంరూరల్/కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలోని మండలాల్లో క్లస్టర్ల వారీగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించేలా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లు ఈనెల 13, 14వ తేదీల్లో మూడు చోట్ల జరగనున్నాయి. కూసుమంచి మండలం జీళ్లచెరువు ఈనెల 13న బుధవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. ఇక్కడ పోచా రం, తురకగూడెం, నేలపట్ల, అగ్రహారం, కోక్యాతండా, లోక్యాతండా, ముత్యాలగూడెం, చేగొమ్మ, ధర్మతండా, మునిగేపల్లి, కేశవా పురం, కిష్టాపురం గ్రామాల ప్రజలు వినతిపత్రాలు అందజేయవచ్చు. అలాగే, 14న ఉదయం 8గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో, మధ్యాహ్నం 3గంటలకు రామన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. కస్టర్ల వారీగా డివిజన్ల ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరిస్తారు.


