సత్వర పరిశీలన, పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిశీలన, పరిష్కారం

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

ఖమ్మంసహకారనగర్‌: ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(గ్రీవెన్స్‌ డే)లో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని, అలా సాధ్యం కాని పక్షంలో కారణాలను దరఖాస్తుదారులకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్‌ ఏఓ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని...

● తల్లాడ మండలం కలకొడిమకు చెందిన మనుబోలు రామారావు తన ఇంటి మార్గంలోని రోడ్డుపై కొందరు కంప వేశారని ఫిర్యాదు చేయగా.. తక్షణ చర్యలు తీసుకోవాలని డీపీఓను కలెక్టర్‌ ఆదేశించారు.

మధిర మండలం వెంకటాపురం, వంగవీడు, సిరిపురం రైతులు పాలవాగు వరద వెళ్లేలా పైపులు పాడైతే ఒక వైపే కొత్తవి వేశారని ఫిర్యాదు చేశారు. దీంతో వర్షం పడినప్పుడు నీరు వాగు వైపునకు రావటం లేదని పేర్కొనగా, పరిశీలించాలని సత్తుపల్లి ఈఈ ఆర్‌ అండ్‌ బీకి సూచించారు.

ఖమ్మంకు దివ్యాంగుడు పగిళ్ల రాము ఉపాధి కోసం మీ సేవ సెంటర్‌ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు.

ఖమ్మంకు చెందిన నిరుపేద దివ్యాంగులు పది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు డి.నాగరాజు కోరారు.

కొణిజర్ల మండలం పెద్దగోపతిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని భారతీయ కిసాన్‌ సంఘ్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించగా.. కొణిజర్ల తహసీల్దార్‌ ఎన్‌.అరుణ అప్పటికప్పుడు కేంద్రాన్ని పరిశీలించారు. క్వింటాకు 10 కేజీల తరుగు తీస్తున్నారని, ఖాళీ గోనె సంచులను తిరిగి అప్పగించకపోతే రూ.85 చొప్పున చెల్లించాలని చెబుతున్నట్లు రైతులు వాపోయారు. దీంతో విచారణ జరిపిస్తామని ఆమె తెలిపారు.

గ్రీవెన్స్‌ డేలో కలెక్టర్‌ దివాకర

Advertisement
 
Advertisement
Advertisement