మరిచిపోయిన బ్యాగ్‌ అప్పగించిన ఆటోడ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

మరిచిపోయిన బ్యాగ్‌ అప్పగించిన ఆటోడ్రైవర్‌

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

భర్త మందలించాడని వివాహిత..

ఖమ్మంక్రైం: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను డ్రైవర్‌ తిరిగి అప్పగించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోతు మంజుల వైద్యం కోసం ఖమ్మం వచ్చింది. పాత బస్టాండ్‌లో దిగాక ఆటోలో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా.. హడావుడిలో రూ.20 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయింది. కాసేపయ్యాక గుర్తించిన ఆమె ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అంతలోనే డ్రైవర్‌ కూడా బ్యాగ్‌ యాజమాని గుర్తింపునకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన బ్యాగ్‌ను మంజులకు అందజేశాడు. ఈ సందర్భంగా డ్రైవర్‌తో పాటు ట్రాఫిక్‌ సిబ్బందిని సీఐ సత్యనారాయణ అభినందించారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడు మృతి

వేంసూరు: ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడడంతో సోదరి ఇంటికి వెళ్లి వస్తున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మండలంలోని బీమవరం – మర్లపాడు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలు.. రాయుడుపాలెం గ్రామానికి చెందిన విసంపల్లి మురళీకృష్ణ (30) తన తండ్రి రాములు, బాబాయి కొడుకు నాగేంద్రబాబుతో కలిసి నారాయణపురంలో ఉంటున్న అక్క వద్దకు ట్రాక్టర్‌లో వెళ్లాడు. సోదరికి సామగ్రి అప్పగించి తిరిగి రాత్రి 11 గంటలకు వస్తుండగా భీమవరం – మర్లపాడు మధ్య ఒక్కసారిగా ట్రాక్టర్‌ బ్రేక్‌ వేయడంతో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ట్రాక్టర్‌ ఇంజన్‌ చెక్కపై కూర్చున్న మురళీకృష్ణ కింద పడడం, ఆయనపై ట్రక్కు పడడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కూసుమంచి: వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, తీర్చే మార్గం లేకపోవడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన దామళ్ల సుధాకర్‌ (49) తనకు ఉన్న కొంత భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే, కొన్నేళ్లుగా దిగుబడులు రాక అప్పులు పెరిగిపోయాయి. అప్పుల విషయమై ఇంట్లో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన సుధాకర్‌ ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

కల్లూరు: అన్నం వండే విషయమై భార్యభర్తల మధ్య వివాదం నెలకొనడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కల్లూరు మండలం వెన్నవల్లికి చెందిన మేకల చిన్ననాగయ్య ఆదివారం మధ్యాహ్నం అన్నం వండే విషయంలో భార్య సత్యవతి(40)ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఎలుకల మందు తాగింది. కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై ఆమె భర్త ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సత్యవతి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement