ఖమ్మంగాంధీచౌక్: ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, పాఠశాలల్లో జరిగే వేడుకలు, కుటుంబాల్లో పెళ్లిళ్లు.. ఇలా ఏ వేదికపై అయినా చిన్నారులు నృత్యం చేసేందుకు అవకాశం దక్కుతోంది. దీనికి కొందరు చిన్నారుల్లో నృత్యంపై సహజంగానే ఆసక్తి ఉంటోంది. ఈ మేరకు వేసవి సెలవుల్లో పలువురు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆవిర్భంవించిన ఈ కళానృత్యం వైపు చిన్నారులు దృష్టి సారిస్తున్నారు. కళారూపం, హస్తముద్రలు, ముఖ, కంటి కదలికలతో పాటు వేగవంతమైన పాద విన్యాసంతో పురాణ గాథలు, భక్తిని ఈ నృత్యం ప్రదర్శిస్తుంది. భరత నాట్యానికి దగ్గరగా ఉండే ఈ నృత్యం ప్రత్యేక శైలిని కలిగి ఉండడంతో చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని ఏలూరి మీనా కొందరు చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. చిన్నారుల ఆసక్తికి అనుగుణంగా నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మీనా వద్ద 50 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల్లో కూచిపూడిపై ఆసక్తి పెరగుతోందని.. అందుకు అనుగుణంగా వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
నృత్య ప్రదర్శనలు అంటే ఇష్టం. చాలా రకాల నృత్యాలు ఉన్నా కూచిపూడిపై ఆసక్తితో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావటంతో శిక్షణ పొందుతున్నా.
–జ్ఞాన సహస్ర,
గట్టయ్యసెంటర్, ఖమ్మం


