కొణిజర్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఏడు పాడిగేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని బొట్లకుంట సమీపాన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రతాపనేని రామకృష్ణ, కూచిపూడి తిరపతిరావుకు చెందిన ఏడు పాడిగేదెలు ఆదివారం సమీపంలోని పొలాల్లో మేతకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, గేదెలు గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి వెళ్లినట్లు తెలియడంతో సోమవారం ఉదయం రైతులు వెతుకుతూ వెళ్లారు. ఈక్రమాన అవి రోడ్డుపై చనిపోయి కనిపించాయి. భారీ వాహనం ఢీకొనడంతోనే గేదెలు మృతి చెందినట్లు భావిస్తుండగా, ఒక్కో గేదె విలువ రూ.90 వేల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పంట పొలాల్లో ఆగని మంటలు
చింతకాని: మండలంలోని నాగులవంచ, లచ్చగూడెం, పాతర్లపాడు గ్రామాల్లో పలువురు రైతుల పొలాల్లో సోమవారం మంటలు చెలరేగాయి. కొందరు తమ పొలాల్లో చెత్తకు నిప్పు పెడుతుండగా, గాలులకు సమీప పొలాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం కూడా పలువురి పొలాల్లో మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అదుపు చేయడంతో ఎలాంటి నష్టం జరగలేదు. అంతేకాక నాగులవంచ సబ్‌స్టేషన్ సమీపాన కూడా మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.
చుక్కల దుప్పి స్వాధీనం
ఖమ్మంరూరల్: మండలంలోని మద్దివారిగూడెం సమీపాన గుట్టల నుంచి సోమవారం ఓ చుక్కల దుప్పి పిల్ల గ్రామానికి వచ్చింది. దుప్పిపిల్లను వీధి కుక్కలు తరుముతుండడంతో స్థానికులు రక్షించి అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో కూసుమంచి డీఆర్‌ఓ కేవీ రామారావు సిబ్బందితో చేరుకుని దుప్పికి పరీక్షలు చేయించాక కిన్నెరసాని డీర్ పార్క్‌కు తరలించారు.


