మొదలుపెడదామా! | - | Sakshi
Sakshi News home page

మొదలుపెడదామా!

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

ప్రత్యేక యాప్‌

మొదటి మూడు రోజులు

బ్లాక్‌ల్లో కుటుంబాల గుర్తింపు

జిల్లాలో 2,651 హెచ్‌ఎల్‌బీ బ్లాక్‌లు, 2,669 మంది ఎన్యుమరేటర్లు

పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు,

నోడల్‌ ఆఫీసర్లు

బ్లాక్‌ల పరిశీలన, గుర్తింపు

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలో జనగణనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లుచేసింది. రెండు దశల్లో గణన చేపట్టనుండగా. తొలిదశ సోమవారం మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో ప్రతీ 300 ఇళ్లను కలుపుతూ బ్లాక్‌లుగా రూపొందించారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 2,651 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లను గుర్తించి మ్యాపింగ్‌ చేశారు. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ ప్రారంభిస్తారు. గతంలో మాదిరి మాన్యువల్‌గా కాకుండా ఈసారి వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదు చేసేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్‌ఎల్‌ఓ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారానే ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

2,669 మంది ఎన్యుమరేటర్లు

జిల్లాలో జనగణనకు సంబంధించి ఇప్పటికే 2,651 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్‌ల్లో సర్వే కోసం 2,669 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. అలాగే, ప్రతీ ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ ఉండేలా 485 మందికి విధులు కేటాయించారు. తొలి దశలో 31 ప్రశ్నలకు ప్రజల నుండి వివరాలు సేకరిస్తారు. ఎన్యుమరేటర్‌ వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరు ఉన్నా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఈ సర్వే వచ్చేనెల 9వ తేదీ వరకు జరగనుండగా, రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

19వేల కుటుంబాలు స్వీయగణన

జనగణనలో ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈమేరకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఆదివారం రాత్రి 11–59 గంటలకు గడువు ముగిసింది. ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలో 19వేల మందికి పైగా స్వీయగణన పూర్తి చేసుకున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇందులో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోనే 3,500కు మందికి పైగా స్వీయగణన చేసుకున్నారు.

కేఎంసీలో భారీ నెట్‌వర్క్‌

ఖమ్మం నగరంలో జనగణన సర్వే పారదర్శకంగా చేపట్టేలా 524 హెచ్‌ఎల్‌బీ(హౌజ్‌ లిస్టింగ్‌ బ్లాక్స్‌) లుగా విభజించారు. ఒక్కో బ్లాక్‌లో సుమారు 290 ఇళ్లు, 800 మంది జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక సర్వే కోసం ఉపాధ్యాయులు 524మందిని ఎన్యుమరేటర్లను నియమించారు. గణనకు అవసరమైన కిట్లు, మ్యాపులను ఇప్పటికే అందజేశారు. సర్వేలో పొరపాట్లు జరగకుండా కమిషనర్‌ ఆదేశాల మేరకు పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సూపర్‌వైజర్ల పనితీరును పర్యవేక్షించేందుకు కేఎంసీకి చెందిన 22 మంది అధికారులను కేటాయించారు. అంతేకాక డిప్యూటీ, అదనపు కమిషనర్లను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు.

ఎండల దృష్ట్యా జాగ్రత్తలు

తీవ్రమైన ఎండల నేపథ్యాన సర్వే ఉదయాన్నే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా సిబ్బంది అస్వస్థతకు గురైనా, ఎవరైనా గైర్హాజరైనా ఆ ప్రాంతంలో సర్వే నిలిచిపోకుండా రిజర్వ్‌గా ఉన్న ఎన్యుమరేటర్లను కేటాయించేలా మానిటరింగ్‌ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు.

జనగణన వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్‌ఎల్‌ఓ సెన్సెస్‌–2027 పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో ఎన్యుమరేటర్లు తాము సర్వే చేసిన కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి. ఆదివారం అర్ధరాత్రి 11–59 గంటల తర్వాత ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చే ఈ యాప్‌ను సోమవారం ఉదయం ఎన్యుమరేటర్లు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఎవరైనా ఇన్‌స్టాల్‌ చేసుకుంటే తొలగించి మళ్లీ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆతర్వాత ఎన్యుమరేటర్‌కు కేటాయించిన ఐడీతో పాస్‌వర్డ్‌ రూపొందించుకుని వివరాల నమోదు ఆరంభించాల్సి ఉంటుంది.

జనగణన సర్వేకు వేళాయె..

జనగణనకు సంబంధించి విధులు కేటాయించిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు అధికారులు శిక్షణ ఇచ్చారు. వీరంతా సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు. తొలి మూడురోజులు హౌస్‌ లిస్టింక్‌ బ్లాక్‌లను పరిశీలించనున్నారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌లో ఉన్న కుటుంబాల సంఖ్య, వివరాలను నమోదు చేసుకుంటారు. ఏదైనా బ్లాక్‌లో 300 ఇళ్ల కన్నా ఎక్కువగా ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తగ్గించాల్సి ఉంటుంది. 310– 320 కుటుంబాలు ఉంటేనే ఎన్యుమరేటర్లు సర్వే చేయాలని సూచించారు. అంతకు మించి కుటుంబాల సంఖ్య ఉంటే మాత్రం మరో భాగంగా విభజించి అదనపు ఎన్యుమరేటర్‌ను నియమిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement