కొత్తగూడెం.. క్లాస్–2
1961లో తొలిసారిగా జనగణన అప్పట్లో నంబర్ వన్ పట్టణంగా కొత్తగూడెం 65 ఏళ్లలో మారిపోయిన అభివృద్ధి చిత్రపటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ నడుస్తోంది. 2021లో జరగాల్సిన గణన ఐదేళ్లు ఆలస్యంగా మొదలైంది. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించనున్నారు. అయితే, తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన జనగణన 1961లో జరిగింది. అప్పటి విశేషాలు, ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక కథనం.
ఏడు తాలూకాలతో..
ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించి 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు. ఇందులో ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ (కొత్తగూడెం) తాలుకాలు ఉన్నాయి. ఆ తర్వాత 1959లో తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం, నుగూరు తాలూకాలను కూడా ఖమ్మం జిల్లాలో చేర్చారు. భద్రాచలం, నుగూరు (వాజేడు, వెంకటాపురం మండలాలతో కూడిన ఉప తాలూకా)లు పూర్తిగా ఏజెన్సీ తాలూకాలుగా ఉండేవి. పూర్తిస్థాయిలో ఖమ్మం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జన గణన 1961లో జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనాభా 10,57,542గా తేలింది.
1990 వరకు అప్రతిహతంగా అభివృద్ధి
1960 నుంచి 1990 వరకు కొత్తగూడెం పట్టణం అప్రతిహతంగా అభివృద్ధి పథంలో నడిచింది. కిన్నెరసాని ప్రాజెక్ట్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ల రాకతో పాల్వంచ సరికొత్త పట్టణంగా రూపాంతరం చెందింది. స్పాంజ్ ఐరన్, ఏపీ స్టీల్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కిన్నెర స్టీల్స్, బేరియం ఫ్యాక్టరీ, మైలారం రాగి గనులు, నవభారత్ వంటి ప్రైవేటు రంగ సంస్థలతో 90వ దశకం నాటికి ఖమ్మంపై కొత్తగూడెం అన్ని రంగాల్లో పైచేయి సాధించింది. మరోవైపు సింగరేణి గనుల కారణంగా కొత్తగూడెం, ఇల్లెందుకు తోడుగా మణుగూరు కూడా పట్టణ ప్రాంతంగా వృద్ధికి వచ్చింది. పేపర్ బోర్డు కారణంగా సారపాక–భద్రాచలం, ఉద్యాన పంటల కారణంగా అశ్వారావుపేట పారిశ్రామిక ప్రాంతాలుగా ఎదిగాయి.
90వ దశకం నుంచి దూసుకొస్తున్న ఖమ్మం
ఆర్థిక సంస్కరణలు 1990లో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. అప్పటికే ఉన్న గ్రానైట్, ఆగ్రో ఇండస్ట్రీస్, మార్కెట్లు ఖమ్మం అభివృద్ధికి తోడ్పడ్డాయి. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు ఏరియాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడం, 1/70 చట్టం కారణంగా ఇక్కడున్న ఉద్యోగులు, కార్మికులకు సొంతిళ్లు కట్టుకునేందుకు ఖమ్మమే అనువైన ప్రాంతంగా కనిపించింది. వెరసి ప్రస్తుతం ఖమ్మం నగర జనాభా (మున్నేరు ఆవల కలుపుకుని) దాదాపు నాలుగు లక్షలకు మించింది. తెలంగాణాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిచింది. నిజామాబాద్, కరీంనగర్‌లకు గట్టిపోటీ ఇస్తోంది.
పూర్వ వైభవం వచ్చేనా..?
కొత్తగూడెంలో ఉన్న అనేక ప్రైవేటు, ప్రభుత్వ పరిశ్రమలు 1990 తర్వాత మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. 2016లో కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడం, మెడికల్ కాలేజీ, పోలీస్ బెటాలియన్, యూనివర్సిటీ వంటివి రావడంతో కొంత మేరకు నష్ట నివారణ జరిగింది. అయినా ఖమ్మానికి పోటీ ఇచ్చే స్థితిలో కొత్తగూడెం లేదు. కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చంచుపల్లి, రుద్రంపూర్‌లను కలిపినా కొత్తగూడెం అర్బన్ జనాభా మూడు లక్షలకు మించడం లేదు. సీతారామ ద్వారా గోదావరి జలాలు అందివ్వడం, ఉద్యోగులు సొంతింటి కల సాకారమయ్యేలా చూడటం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తేవడం, జాతీయ రహదారుల ఆధారంగా కొత్త అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ఎకో–టెంపుల్ టూరిజంపై ఫోకస్ చేయడం వంటి చర్యల ద్వారా భద్రాద్రి కొత్తగూడేనికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.
జనగణన–1961 జరిగే సమయానికి కొత్తగూడెం పట్టణం ఇటు జనాభా, అటు విస్తీర్ణం పరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కొత్తగూడెం మున్సిపాలిటీ 69,728 మంది జనాభాతో క్లాస్–2 మున్సిపాలిటీ ఉండగా, ఖమ్మం 35,888 జనాభాతో క్లాస్–3 మున్సిపాలిటీగా ఉంది. ఖమ్మానికి పాలక మండలి ఉండగా, కొత్తగూడేనికి లేదు. ఆ తర్వాత ఇల్లెందు 10,955 మంది జనాభాతో క్లాస్–4 మున్సిపాలిటీగా గుర్తింపు దక్కించుకుంది. ఇక మున్సిపాలిటీ కేటగిరిలోకి రాకుండా 6,059 జనాభాతో మధిర, 5,740 జనాభాతో భద్రాచలం పట్టణ ప్రాంతాలుగా నిలిచాయి.
1953లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆవిర్భావం


