20వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో...
● 50శాతం సబ్సిడీతో నేటి నుంచి పంపిణీ ● సహకార సంఘాలు, ఆగ్రోస్ సంస్థల ద్వారా సరఫరా ● ఉమ్మడి జిల్లాలో 18,440 క్వింటాళ్లకు ఇండెంట్
ఖమ్మంవ్యవసాయం: పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. సేంద్రియ విధానంలో భూసారాన్ని పెంచడంలో పచ్చిరొట్ట సాగు ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలుగా వినియోగించే వరి, అపరాలు, నూనె గింజల పంటలు, ఉద్యాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నుతారు. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయి. ఈమేరకు ఏటా మాదిరిగానే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
అటు సబ్సిడీ.. ఇటు ధర భారం
పచ్చిరొట్ట విత్తనాలకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఈ ఏడాది 50 శాతం సబ్సిడీ ప్రకటించింది. ఈ విధానంలో జీలుగు, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అయితే, పచ్చిరొట్ట విత్తనాల ధరలు మూడేళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా ధరలు పెరగడంతో రైతులకు అంతగా ప్రయోజనం కలగటం లేదు. విత్తన ధర క్వింటాకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు పలుకుతుండగా, సబ్సిడీ పోగా రైతులు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు రైతులు రసాయన ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎక్కువగా జీలుగు
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం 18,340 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కావాలని ఇండెంట్ పెట్టారు. అధికంగా 16వేల క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అవసరమని అందులో పేర్కొన్నారు. అలాగే, జనుము 1,760 క్వింటాళ్లు, పిల్లి పెసర 680 క్వింటాళ్లకు అవసరమని తెలిపారు. ప్రస్తుతం విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 500 క్వింటాళ్ల జీలుగు, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు ఉండగా, పంపిణీ చేస్తుంటే దశల వారీగా చేరనున్నాయి. ఈ విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా సోమవారం నుంచి పంపిణీకి నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 75 సహకార సంఘాలు, ఏడు ఆగ్రోస్ రైతు సేవా సంస్థలు, భద్రాద్రి జిల్లాలో 20 సహకార సంఘాలు, రెండు ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా పంపిణీ జరగనుంది. ప్రభుత్వం ఈ విత్తనాలను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సేకరించి సరఫరా చేస్తుంది.
వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ మేరకు పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే విత్తనాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేశాం. ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో విత్తనాలు సిద్ధంగా ఉంటాయి.
– ఎన్.భిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ,
ఉమ్మడి జిల్లా ప్రాంతీయ మేనేజర్


