నేటి నుంచి విద్యా వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి విద్యా వారోత్సవాలు

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

● ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహణ ● రోజుకొక కార్యక్రమంతో షెడ్యూల్‌ ఖరారు

అందరూ పాలుపంచుకోవాలి

● ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహణ ● రోజుకొక కార్యక్రమంతో షెడ్యూల్‌ ఖరారు

ఖమ్మంసహకారనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వార్యన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేయడమే కాక ప్రవేశాల పెంపునకు కార్యాచరణ రూపొందించారు.

ఇదీ షెడ్యూల్‌..

సోమవారం (ఈ నెల 11వ తేదీ): ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, నూతన నిర్మాణాలే కాక అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యాన చేపట్టే పనులను ప్రారంభిస్తారు. అలాగే, 18 పీఎంశ్రీ పాఠశాలలు, ఒక కేజీబీవీలో రెసిడెన్షియల్‌ సమ్మర్‌ క్యాంప్‌లను ప్రారంభిస్తారు.

మంగళవారం (12వ తేదీ): పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం రెండు సమ్మర్‌ క్యాంపులను ప్రారంభిస్తారు. ఇందుకోసం కూసుమంచి, రఘునాథపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌లను ఎంపిక చేశారు. ఈ క్యాంపుల్లో పాల్గొనే విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేస్తారు. అలాగే, మధ్యాహ్న భోజనం, స్టేషనరీ కింద రూ.వంద, రవాణా అలవెన్స్‌గా ప్రతీ విద్యార్థికి రూ.వేయి నగదు అందజేస్తారు. ఈ క్యాంప్‌ల నిర్వహణతో సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బుధవారం (13వ తేదీ): ప్రతీ మండలస్థాయిలో సర్పంచ్‌లకు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలను వారికి వివరిస్తారు. అంతేకాక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు సహకరించాలని వివరిస్తారు.

గురువారం (14వ తేదీ): ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట, మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యాన బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు చేపడుతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల్లో అల్పాహారం అందించే అంశాన్ని వివరిస్తారు. డ్రాప్‌ అవుట్‌ అయిన విద్యార్థులను తిరిగి చేర్పించడంతో పాటు సున్నా ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.

శుక్రవారం (15వ తేదీ): విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదో రోజున లైబ్రరీ డేగా నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో ఉన్న గ్రంథాలయ సదుపాయంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాక దాతల నుంచి పుస్తకాలు స్వీకరిస్తారు.

శనివారం (16వ తేదీ): విద్యార్థులకు జిల్లాస్థాయి ఆర్ట్‌, క్రాఫ్ట్‌, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు. మండలాల్లో విజేతలను ఆహ్వానించి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాక విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఖమ్మం మామిళ్లగూడెంలోని బాల భవన్‌లో జరగనుంది.

ఆదివారం (17వ తేదీ): వారోత్సవాల్లో ముగింపును చివరి రోజు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పదో తరగతిలో జిల్లాస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందిస్తారు.

నేటి నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఎంఈఓలు, హెచ్‌ఎంలతో పాటు విద్యాశాఖ బాధ్యులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశాం. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలి.

–చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి

Advertisement
 
Advertisement
Advertisement