తాలు పేరుతో కోత విధించొద్దు | - | Sakshi
Sakshi News home page

తాలు పేరుతో కోత విధించొద్దు

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం సహకారనగర్‌: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాక తాలు పేరుతో కోత విధించొద్దని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నిర్దిష్ట కారణాలు లేకుండా తిరస్కరించొద్దని తెలిపారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని భావిస్తే జిల్లా పౌర సరఫరాల అధికారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత సాంకేతిక సహాయ కమిటీ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు లేవని నిర్ధారణ అయితేనే ధాన్యాన్ని తిరస్కరిస్తామని తెలిపారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరిగేలా హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీఎస్‌ఓ చందన్‌ కుమార్‌, మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై మళ్లీ బ్రేక్‌

వైరా: ఫాస్ట్‌ట్రాక్‌కు సంబంధించి సర్వర్‌ మొరాయించడంతో ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఆదివారం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇదే సమస్య ఏర్పడగా సరిచేశారు. మళ్లీ ఆదివారం కూడా సర్వర్‌లో అంతరాయం ఏర్పడడంతో హైవే మార్గంలోని వైరా మండలం సోమవరం ఎగ్జిట్‌ పాయింట్‌ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో మండుటెండలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈమేరకు అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో రాకపోకలు మొదలయ్యాయి.

కిన్నెరసానిలో

పర్యాటక సందడి

పాల్వంచరూరల్‌: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌, జలాశయం, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.25,370 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.12,632 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement