నిప్పుల కుంపటి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కుంపటి

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

● 43 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ● వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

● 43 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ● వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

ఖమ్మంవ్యవసాయం: భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతల ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్ది రోజులుగా జిల్లా అంతటా 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే మొదలవుతున్న ఎండ ప్రభావం సాయంత్రం 5గంటల వరకు కూడా కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ ఎండకు తోడు వడాగాలుల తీవ్రతతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. యాసంగి పంటలు చేతికి అందుతున్న వేళ వ్యవసాయ కూలీలు, రైతులు సైతం ఉదయం, సాయింత్రమే పనులు చేసుకుంటున్నారు.

ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి

ఎండతీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్దులు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా పగలు, రాత్రీ తేడా లేకుండా కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగి తరచూ విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే, రాత్రివేళ లోవోల్టోజీ సమస్య వేధిస్తోంది. విద్యుత్‌ వినియోగం పెరగడంతోనే ఈ సమస్య వస్తోందని విద్యుత్‌ ఉద్యోగులు చెబుతున్నారు.

గరిష్టంగా గుబ్బగుర్తిలో..

కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఆదివారం గరిష్టంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, తిమ్మారావుపేట, పమ్మిలో 42.8, బాణాపురం, నేలకొండపల్లిలో 42.6, రావినూతలలో 42.5, వైరా(ఏఆర్‌ఎస్‌)లో 41.8, ప్రకాష్‌నగర్‌లో 41.3, కూసుమంచిలో 41.2, వైరాలో 41.1 మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కొణిజర్లలో 40.9, మధిరలో 40.7, ఖమ్మం ఖానాపురం, ఏన్కూరులో 40.6, గౌరారం, సిరిపురంలో 40.5, కుర్నవల్లిలో 40.4, పంగిడిలో 40.3, లింగాల, నాగులవంచలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిష్టంగా వేంసూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement