ఈత సరదా.. కావొద్దు బాధ | - | Sakshi
Sakshi News home page

ఈత సరదా.. కావొద్దు బాధ

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

● వేసవి సెలవుల్లో నేర్చుకునేందుకు పిల్లల ఆసక్తి ● తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాలు పదిలం ● తల్లిదండ్రులు, నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి

జాగ్రత్తలు పాటించాలి

● వేసవి సెలవుల్లో నేర్చుకునేందుకు పిల్లల ఆసక్తి ● తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాలు పదిలం ● తల్లిదండ్రులు, నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి

ఇల్లెందురూరల్‌: వేసవి వచ్చిందంటే ఉక్కబోత కారణంగా పిల్లలు ఈత కొట్టాలని ఆసక్తి కనబరుస్తుంటారు. ఇందులో పట్టణాల్లో స్విమ్మింగ్‌ పూల్‌లు అందుబాటులో ఉన్నా.. గ్రామాలకు వచ్చేసరికి బావులు, చెరువులను ఆశ్రయిస్తారు. అయితే, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు దరి చేరడమే కాక ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. ఈ నేథ్యాన తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈత నేర్పించడం సులువవుతుంది.

అవగాహన లేక

ఇల్లెందు మండలం హనుమంతులపాడుకు చెందిన ఊకం సాగర్‌ (14) నాలుగు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకున్నా రక్షణ పరికరాలు లేకుండా బావిలోకి దూకగా మునిగిపోయాడు. రెండేళ్ల క్రితం మామిడిగుండాల గ్రామానికి చెందిన ఎర్రిపోతు భిక్షపతి ఈత రాకున్నా డబ్బా నడుముకు కట్టుకొని బావిలోకి దిగాడు. డబ్బా మధ్యలోనే జారిపోవడంతో మృత్యువాత పడ్డాడు. గతేడాది ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం రాంబాబు చెరువులో చేపలు పడుతుండగా గడ్డిజాతి తీగలు కాళ్లకు చుట్టుకొని నీట మునిగిపోయి మృతిచెందాడు.

తల్లిదండ్రుల్లో మార్పు

తల్లిదండ్రుల దృక్పథం గతంతో పోలిస్తే మారింది. ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తాం చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని మాత్రమే భావిస్తున్నారు. మిగతా క్రీడలతో పాటు ఈత వంటి సంప్రదాయ, అభిరుచి ఉన్న ఆటల వైపు ప్రోత్సహించడం లేదు. పాఠశాలలు, శిక్షణలు, ప్రత్యేక తరగతుల పేరుతో యవ్వన దశ దాటేస్తుండగా.. నడి వయస్సులో ఈత నేర్చుకునే అవకాశం ఉన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది.

అప్రమత్తత తప్పనిసరి

తల్లిదండ్రులు తమ సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పాలి. లేదంటే అనుభవం ఉన్న వారితో తర్ఫీదు ఇప్పించాలి. ఆడా, మగ తేడా లేకుండా పిల్లలకు తప్పనిసరిగా ఈత నేర్పితే భవిష్యత్‌లో నీటి ప్రమాదాలకు ఆస్కారముండదు. ఈతరాని వారు నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అడుగంటిన బావులు, చెరువులలో నీరు కలుషితంగా మారి అందులో ఈత కొడితే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే మంచినీరు ఉన్న బావులు, చెరువులనే ఎంచుకోవాలి. అంతేకాక బుర్రలను కట్టుకొని దిగితే నీటిలో తడిసి, బుర్రకాయకు రంధ్రాలు ఉంటే చిన్నారులు మునిగే అవకాశముంది. అందుకే సొరకాయ బుర్రలు, డబ్బాలకు బదులు నాణ్యమైన, సరిపడా సైజ్‌ కలిగిన ట్యూబ్‌లను వాడాలి.

వేసవిలో పిల్లలకు ఈత సరదాగా ఉంటుంది. ఈత మంచిదే అయినా ఆరోగ్యకరమైన చికాకులు కూడా ఉంటాయని పెద్దలు గుర్తించాలి. కలుషిత నీటి వల్ల కంటి సంబంధ, చర్మ, అతిసారా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మంచినీరు ఉన్న వనరులను ఎంచుకోవడమే కాక నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంటే ప్రమాదాలను అధిగమించవచ్చు.

–డాక్టర్‌ మోతీలాల్‌, చిన్నపిల్లల వైద్యుడు, ఇల్లెందు

Advertisement
 
Advertisement
Advertisement