బడుల్లో సమ్మర్‌ క్యాంపులు | - | Sakshi
Sakshi News home page

బడుల్లో సమ్మర్‌ క్యాంపులు

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

● 18 పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● నేటి నుంచి 25వ తేదీ వరకు శిక్షణ

సద్వినియోగం చేసుకోండి

నైపుణ్యాల పెంపునకు కృషి

● 18 పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● నేటి నుంచి 25వ తేదీ వరకు శిక్షణ

ఖమ్మంసహకారనగర్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలలతో పాటు ఒక కేజీబీవీలో ఈ క్యాంపులను సోమవారం ప్రారంభిస్తారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు క్యాంపులు కొనసాగనున్నాయి.

ఆటపాటలు.. విద్యాభివృద్ధి

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా క్యాంపుల్లో శిక్షణ ఇస్తారు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, కథలు చెప్పడమే కాక చెస్‌, క్యారమ్స్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌లో శిక్షణ ఉంటుంది. అంతేకాక చదువుపై ఆసక్తి కల్పించడం, ఆటపాటల ద్వారా అభ్యసనంపై అవగాహన కల్పిస్తారు. ప్రతీ క్యాంపులో నిపుణులైన నలుగురు ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. ఈ క్యాంపులు ప్రతీరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. పీఎంశ్రీ పాఠశాలల్లోని బాలబాలికలే కాక సమీప పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు కూడా ఈ క్యాంపులకు హాజరుకావొచ్చు.

ప్రత్యేక నిధులు

క్యాంపుల నిర్వహణకు ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నిధులు కేటాయించారు. ప్రతీ క్యాంప్‌లో ఏవైనా నాలుగు కోర్సులకు సంబంధించి రిసోర్స్‌ పర్సన్లు లేదా మాస్టర్‌ ట్రెయినర్లు, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. ఈ మేరకు 15 రోజులకు గాను ఒక్కొక్కరికీ రూ.3 వేల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బాలబాలికల శిక్షణకు ఉపయోగపడే చార్టులు, స్కెచ్‌లు, పేపర్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.10 వేలు వెచ్చించాలి. అంతేకాక ఫ్లెక్సీలు ఏర్పాటుకు రూ.3,500 కేటాయించారు. అలాగే, క్యాంప్‌లకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్‌ అందిస్తారు. వంట పనుల్లో సాయపడే ఇద్దరు వర్కర్లకు రూ.వేయి చొప్పున చెల్లించాలి. ఈ బాధ్యతలన్నీ సమ్మర్‌ క్యాంప్‌ కొనసాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించే సమ్మర్‌ క్యాంపుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఉంటుంది. ఆటపాటలతో పాటు ఇతర అంశాల్లో శిక్షణ ఇప్పిస్తాం. సెలవుల్లో ఈ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

–పెసర ప్రభాకర్‌రెడ్డి,

జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి

జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఇన్‌స్ట్రక్టర్ల నియామకం వంటి పనులు పూర్తయ్యాయి. 15 రోజుల పాటు కొనసాగే క్యాంపులను పర్యవేక్షిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తాం.

–చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి

Advertisement
 
Advertisement
Advertisement