::.. తాళ్లపల్లి శిరీష, కొత్తగూడెం కార్పొరేషన్ ఉద్యోగి
కొత్తగూడెం అర్బన్: పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని చెబుతున్నారు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ తాళ్లపల్లి శిరీష. పిల్లల పోషణ, కుటుంబ నిర్వహణతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకోవడం ఎవరికై నా భారంగానే ఉంటుందని తెలిపారు. అయితే, ఇంట్లో భర్తతో పాటు కార్యాలయంలో అధికారులు, సహోద్యోగుల సహకారంతో భారం తగ్గి పనులు సులువుగా చేసుకోగలుగుతున్నానని వెల్లడించారు. పది నెలల పాపను, ఎల్‌కేజీ చదివే అబ్బాయిని చూసుకుంటూనే ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి తన భర్త కూడా సమయం కేటాయించి పనుల్లో సాయం చేయడం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో వీఆర్‌ఓగా సుజాతనగర్ మండలంలో పనిచేసినప్పుడు ఆరు నెలల కుమారుడిని తనతో పాటే తహసీల్‌కు తీసుకెళ్లి పనిచేసినా అధికారులు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అందరి నుంచి సహకారం ఉన్నప్పటికీ సమాజంలో ఇంకొంత మార్పు రావాలని, కష్టపడుతున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను గుర్తించాలని తెలిపారు.
అమ్మ అంటే ప్రేమకు ప్రతీక మాత్రమే కాదు.. బాధ్యత, ఓర్పు, త్యాగానికి మరో పేరు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఉద్యోగ రంగంలోనూ రాణిస్తున్నారు. కచ్చితమైన పనివేళలు కాకుండా ఎప్పుడైనా విధులకు సిద్ధంగా ఉండే ఉద్యోగాలను సైతం మహిళలు ఎంచుకుంటున్నారు. ఈక్రమాన ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగాలను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్నారు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఉద్యోగం – కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కొందరు మహిళా ఉద్యోగుల పరిచయం.


