విద్యావారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

విద్యావారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

తిరుమలాయపాలెం: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. హైదరాబాద్‌ నుంచి శనివారం ఆయన వీసీ ద్వారా జనగణన, ఫార్మర్‌ రిజిస్ట్రీ, ధాన్యం కొనుగోళ్లు, విద్యా వారోత్సవాలపై సమీక్షించగా, తిరుమలాయపాలెం తహసీల్‌ నుంచి కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ విద్యా వారోత్సవాల్లో రోజువారీ షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. ఆ తర్వాత ఫార్మర్‌ రిజిస్ట్రీ, జనగణనపై సూచనలు చేశారు. డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, సీపీఓ శ్రీనివాస్‌, డీఈఓ చైతన్యజైనీ తదితరులు పాల్గొన్నారు.

జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని స్వామి వారి పాదాలకు తెల్లవారుజామునే అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం పల్లకీసేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మధిర: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశానికి ఈనెల 13న పాలిసెట్‌ జరగనుండగా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌, జిల్లా సమన్వయకర్త కె.సాంబయ్య తెలిపారు. జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఖమ్మంలో ఆరు, మధిరలో మూడు ఏర్పాటుచేశామని వెల్లడించారు. మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌, టీవీఎం స్కూల్‌, సీపీఎస్‌ స్కూల్‌తో పాటు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌, ఎస్‌బీఐటీ, కవిత మెమోరియల్‌ డిగ్రీ కళాశాల, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్‌ కళాశాల, డీఆర్‌ఎస్‌ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో 3,696 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులను 11 గంటల వరకే అనుమతిస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

రహదారిని పరిశీలించిన ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ

చింతకాని: మండలంలోని మత్కేపల్లిలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జగన్నాథపురం వరకు ఇటీవల నిర్మించిన బీటీ రహదారిని పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) జోగారెడ్డి శనివారం పరిశీలించారు. రూ.కోటి వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగారహదారి నాణ్యత, వ్యవసాయ బావుల వద్ద గోడల నిర్మాణం, మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుపై సూచనలు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ వెంకటరెడ్డి, ఈఈ మహేష్‌బాబు, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement