చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

● ఈనెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

● ఈనెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తిరుమలాయపాలెం: రైతులు యాసంగిలో పండించిన వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని.. ఈ విషయంలో రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించాక మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు కల్లాల వద్దకు వచ్చి ప్రభుత్వంపై బురద చల్లుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. గతంలో రైతులకు బేడీలు వేసిన వారు నేడు కొనుగోలు కేంద్రాల వద్ద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. అందుకే రుణమాఫీ చేయడంతో పాటు సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు. కాగా, పాలేరు నియోజకవర్గంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాదర్బార్‌లలో 14,700 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్లు, ఉచిత విద్యుత్‌ కోసం ఉన్నాయని చెప్పారు. అవకాశం ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తూ, మిగతావి మూడు నెలల్లో పరిష్కరించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

అర్హులందరికీ ఇళ్లు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధి దారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు కేటాయిస్తామని, రెండో విడతగా ఈ నెలాఖరు నుంచి మంజూరు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బంది పడుతున్నందున తాము ‘భూ భారతి’కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వివరించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంతో పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, మొక్కజొన్న అమ్మి నెల దాటినా డబ్బు జమ కాలేదని, పంటను వెంటనే గోదాంలకు తరలించాలని రైతులు, నాయకులు, తహసీల్‌ భవనం 11 నెలల అద్దె ఇప్పించాలని యజమాని మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ రాంబాబు, విద్యుత్‌ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, హౌజింగ్‌ పీడీ శ్రీనివాస్‌, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి చందన్‌కుమార్‌, డీఆర్‌డీఓ శ్రీరామ్‌, మద్దులపల్లి మార్కెట్‌, ఆత్మ కమిటీల చైర్మన్లు హరినాథ్‌బాబు, చావా శివరామకృష్ణ, నాయకులు, ప్రజాప్రతినిధులు రామసహాయం నరేశ్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్‌, కొప్పుల అశోక్‌, మంగీలాల్‌, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement