● కుటుంబ – ఉద్యోగ బాధ్యతల్లో మహిళామణులు ● రెండింటిని సమన్వయం చేస్తూ ముందడుగు ● సహోద్యోగులు, కుటుంబం అండగా నిలిస్తే మేలని భావన
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
●ఖాకీ చొక్కా చాటున మాతృత్వం
::.. సంకీర్తన, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
కరకగూడెం: కరకగూడెంకు చెందిన సంకీర్తన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తూనే, తన మూడేళ్ల కుమారుడు రుద్రాన్ష్ గౌడ్ పెంపకంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. యూనిఫామ్ ధరిస్తే విధినిర్వహణలో.. ఇంటికి వెళ్లగానే ఆప్యాయత పంచే తల్లిగా ఆమె పాత్ర పోషిస్తారు. రైల్వే రక్షణ రంగం అంటే నిర్ణీత వేళలు ఉండకపోగా అర్ధరాత్రి అయినా, పండుగ రోజైనా అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ‘కొన్ని సందర్భాల్లో కుమారుడిని వెంట తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే మహిళలకు సమాజం సరైన ప్రోత్సాహం.. భర్త, అత్తమామల సహకారం ఉంటే వృత్తిపరంగా మరింత ఎత్తుకు ఎదుగుతారు. అంతేకాక ప్రజా సేవలో భాగస్వాములవుతున్న మహిళల కష్టాన్ని గుర్తించి గౌరవించే సమాజం కావాలి’ అని సంకీర్తన ఆకాంక్షించారు.


