రేపటి నుంచి ఏఐయూకేఎస్‌ జాతీయ మహాసభలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏఐయూకేఎస్‌ జాతీయ మహాసభలు

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్‌) రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయడంతో పాటు దిగుమతి సుంకాలు తగ్గించడం, ఆపై అమెరికా నుంచి దిగుమతులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ తరుణాన ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇల్లెందులో నిర్వహించే ఏఐయూకేఎస్‌ ప్రథమ జాతీయ మహాసభలు కీలకంగా మారనున్నాయని తెలిపారు. ఈ సభల్లో రైతుల సమస్యలపై చర్చించడమే కాక భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తొలిరోజైన సోమవారం ఇల్లెందులో ర్యాలీ, సింగరేణి మైదానంలో బహిరంగ సభ ఉంటాయని తెలిపారు. ఆల్‌ ఇండియా ఆర్గనైజింగ్‌ కమిటీ కన్వీనర్‌ కెచ్చెల రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించే సభలో జాతీయ నాయకులు ప్రదీప్‌సింగ్‌ఠాగూర్‌, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొంటారని, సభలను జయప్రదం చేసేందుకు మేధావులు, రైతులు, ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు మలీదు నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, పాశం అప్పారావు, కేలోతు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement