సైబర్‌ నేరాల కట్టడికి కృషి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాల కట్టడికి కృషి

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌

సత్తుపల్లి: పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయటంతో పాటు సైబర్‌ నేరాల కట్టడికి కృషి చేస్తున్నామని ఖమ్మం పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. సత్తుపల్లిలో ఆధునికీకరించిన కల్లూరు ఏసీపీ కార్యాలయాన్ని ఏసీపీ వసుంధర యాదవ్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కట్టడి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులకు మెరుగైన వసతీ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తొలుత సిబ్బంది నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ రామానుజం, సీఐలు శ్రీహరి, ముత్తిలింగం, ఎస్సైలు పాల్గొన్నారు.

మత్స్యకారులకు శిక్షణ

కూసుమంచి: మండలంలోని పాలేరు పీ.వీ. నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల షెడ్యూల్‌ కులాలకు చెందిన మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల గొండ, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల మత్స్యకారులు పాల్గొనగా.. శాస్త్రవేత్తలు శాంతన్న, రవిందర్‌, అరుణ్‌ ‘జలాశయాల్లో చేపల పెంపకం – యాజమాన్య పద్ధతులు’పై అవగాహన కల్పించారు. దడి(కంచె)లో చేపల పెంపకానికి స్థలం ఎంపిక, దడి నిర్మాణంలో జాగ్రత్తలు, పంజరాల్లో చేపల పెంపకం చేపట్టేలా అవసరమైన నీరు, మేత, మార్కెటింగ్‌ అవకాశాలపై వివరించారు.

నేడు తిరుమలాయపాలెంలో ప్రజాదర్బార్‌

తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గంలోని మండలాల్లో క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ శనివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరగనుంది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ చావా శివరామకృష్ణ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్‌, ఎస్సై కూచిపూడి జగదీష్‌, ఎంపీఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజాదర్బార్‌లో తిరుమలాయపాలెం, బాలాజీనగర్‌ తండా, ఎదుళ్లచెరువు, కేశ్వాపురం, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి, తాళ్లచెరువు, తిమ్మక్కపేట, అజ్మీరా తండా, దమ్మాయిగూడెం, తెట్టెలపాడు, తిప్పారెడ్డిగూడెం, పడమటి తండాతో పాటు హైదర్‌సాయిపేట గ్రామాల ప్రజలు వినతిపత్రాలు అందించవచ్చని అధికారులు తెలిపారు.

పదోన్నతుల జాబితాలో ముగ్గురు ఏడీఏలు

ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రప్రభుత్వం పదోన్నతులు, బదిలీలకు అనుమతి ఇవ్వడంతో వ్యవసాయ శాఖలో ప్రక్రియ మొదలైంది. తొలుత పదోన్నతులకు అర్హులైన వారిని డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) ద్వారా గుర్తించారు. ఇందులో భాగంగా ఏడీఏ(సహాయ వ్యవసాయ సంచాలకులు)లకు డీడీఏ(ఉప సహాయ సంచాలకులు)లుగా పదోన్నతి కల్పించేలా జాబితా రూపొందించగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి స్థానం దక్కింది. మధిర ఏడీఏ ఎస్‌.విజయ్‌చందర్‌, ఖమ్మం భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ స్వరూపారాణి, భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి(ఏడీఏ) బాబూరావు ఇందులో ఉన్నారు. త్వరలోనే వీరికి డీడీఏలుగా పదోన్నతి కల్పించి నూతన స్థానంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. ఇదే సమయాన మండల వ్యవసాయాధికారులకు కూడా సహాయ వ్యవసాయ సంచాలకులుగా పదోన్నతి కల్పించే అవకాశాలున్నాయి. నెల వ్యవధిలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement