ముందస్తుగా పుస్తకం | - | Sakshi
Sakshi News home page

ముందస్తుగా పుస్తకం

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

● జిల్లాకు చేరిన 3.67లక్షల పాఠ్యపుస్తకాలు ● బడి తెరిచిన మొదటిరోజే పంపిణీకి సిద్ధం

● జిల్లాకు చేరిన 3.67లక్షల పాఠ్యపుస్తకాలు ● బడి తెరిచిన మొదటిరోజే పంపిణీకి సిద్ధం

ఖమ్మంసహకారనగర్‌: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గతంలో బడులు తెరిచిన చాలారోజుల వరకు పుస్తకాలు అందకపోయేవి. కానీ రెండేళ్లుగా మార్పులు చేశారు. ఇందులో భాగంగా ఈసారి కూడా జిల్లాకు టైటిళ్ల వారీగా పుస్తకాలను చేరవేస్తున్నారు.

1,230 స్కూళ్లు, 60వేల మంది విద్యార్థులు

జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 1,230 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 60వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. వీరికి కావాల్సిన పాఠ్యపుస్తకాలను జిల్లాకు చేరవేయడం మొదలుపెట్టారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1నుంచి 10వ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు ముద్రించారు. ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మీడియం పాఠాలు ఉంటాయి.

తొలుత పార్ట్‌–1

రెండు భాషల్లో ముద్రణతో పుస్తకాలను పాఠ్యాంశాల వారీగా రెండుగా విభజించారు. ఇందులో పార్ట్‌–1 పుస్తకాలను తొలుత అందజేస్తారు. జిల్లా విద్యార్థులకు అన్ని టైటిళ్లు కలిపి పార్ట్‌–1లో 4,45,820 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటివరకు 3,67,366 పుస్తకాలు జిల్లాకు చేరాయి. మిగతావి కూడా స్కూళ్ల ప్రారంభానికి ముందే చేరతాయని చెబుతున్నారు. ఈ పుస్తకాలను ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలోనే నిల్వ చేస్తుండగా, త్వరలోనే ఎమ్మార్సీలకు, అక్కడి నుంచి పాఠశాలల వారీగా సరఫరా చేస్తారు.

ప్రారంభం రోజునే పంపిణీ..

జూన్‌ 12వ తేదీ నుంచి విద్యాసంవత్సరం మొదలవుతుంది. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. కాగా, గతంలో పాఠ్యపుస్తకాలతో పాటే నోట్‌ పుస్తకాలను సైతం గోదాములకు చేర్చి అక్కడి నుంచి పాఠశాలలకు పంపించేవారు. కానీ ప్రస్తుతం నోట్‌పుస్తకాలను నేరుగా పాఠశాలలకు పంపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement