కోతకు గురైన నూతన వారధి | - | Sakshi
Sakshi News home page

కోతకు గురైన నూతన వారధి

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

● సారపాక వైపు దెబ్బతిన్న గోదావరి బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు ● పాత వంతెనపైకి ట్రాఫిక్‌ మళ్లింపు

● సారపాక వైపు దెబ్బతిన్న గోదావరి బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు ● పాత వంతెనపైకి ట్రాఫిక్‌ మళ్లింపు

భద్రాచలంటౌన్‌/బూర్గంపాడు: సారపాక–భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జి అప్రోచ్‌ సారపాక వైపు కోతకు గురైంది. అప్రోచ్‌ రోడ్డు వద్ద మట్టి జారిపోవడంతో వంతెన – రోడ్డు మధ్య భారీ గ్యాప్‌ ఏర్పడింది. ఈ విషయన్ని గురువారం రాత్రి గమనించిన నేషనల్‌ హైవేస్‌ అధికారులు కొత్త బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి పాత బ్రిడ్డి పైకి మళ్లించారు. ఒకే బ్రిడ్జిపై రాకపోకలతో వాహనాల రద్దీ పెరిగింది. నిన్నటి వరకు భద్రాచలం వెళ్లే వాహనాలు కొత్త బ్రిడ్జిపై నుంచి, భద్రాచలం నుంచి బయటకు వచ్చే వాహనాలు పాత బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త బ్రిడ్జి అప్రోచ్‌కు పోసిన మట్టి కోతకు గురికావటంతో మళ్లీ పాత బ్రిడ్జియే రాకపోకలకు దిక్కయింది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన పాత బ్రిడ్జి ఇప్పటి వరకు ఎక్కడ పెద్దగా దెబ్బతినలేదు. ఏడాది క్రితం నిర్మించిన కొత్త బ్రిడ్జి అప్రోచ్‌ కోతకు గురవడంతో పనుల నాణ్యతపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆది నుంచీ విమర్శలే..

రూ.కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టగా, పనుల దశ నుంచే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే ఓ పిల్లరు కుంగిపోవడంతో అధికారులు దానిని తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. తాజాగా అప్రోచ్‌ రోడ్డు వద్ద మట్టి పక్కకు జారిపోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పద్ధతిలో రాతి అప్రోచ్‌ను బలోపేతం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎప్పటి నుంచో కుంగిన అప్రోచ్‌ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మట్టి మరింతగా జారిపోయింది. భద్రాచలం ట్రాఫిక్‌ పోలీసులు, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద తీవ్రతను గమనించి వంతెన రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు ప్రధాన వారధిగా ఉన్న ఈ వంతెనపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తిస్థాయిలో నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని, కాంట్రాక్ట్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement