● ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
మధిర: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. మధిరలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేసిన వివిధ విభాగాలను పరిశీలించాక చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరాతీశారు. ఆతర్వాత వైద్యులు, సిబ్బంది హాజరు, రోజువారీ ఓపీ, ఔషధాల లభ్యత, పరిశుభ్రతను పరిశీలించి సేవలు మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలే తప్ప అనవసరంగా సిజేరియన్లు చేయొద్దని తెలిపారు. అనంతరం మధిరలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులతో పాటు సిరిపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, ఐటీఐ భవనం, ఏఐటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. తహసీల్దార్ రాంబాబు, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.
సోలార్ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలవాలి
ఎర్రుపాలెం: రాష్ట్రంలోనే తొలిసారి ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సోలార్ ప్రాజెక్టు నిర్వహణ ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. రాజుపాలెంలో సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఆయన మాట్లాడారు. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నందున త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆతర్వాత ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణ తీరును పరిశీలించారు. డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్, రెడ్కో డీఎం పి.అజయ్‌కుమార్, డీఆర్‌డీఓ ఏపీడీ జయశ్రీ, ఏడీఏ విజయ్‌చందర్, తహసీల్దార్ ఉషాశారద, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, సర్పంచ్ బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు.
పనుల్లో నాణ్యత తప్పనిసరి
బోనకల్: యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంలో వేగంతో పాటు నాణ్యత కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్కూల్ భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. అయితే, తల్లిదండ్రుల వెయిటింగ్ హాల్, తదితర అంశాలపై సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈఈ జనగాం బుగ్గయ్య తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రురావత్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


