వేసవి సెలవుల్లో యోగా
శిక్షణ పొందుతున్న సత్తుపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్ విద్యార్థినులు పలు పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. మూడేళ్లుగా వేసవి సెలవుల్లో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యాన యోగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన శిక్షణ తరగతులకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. అయితే, సెలవుల్లో కాకుండా తర్వాత కూడా పలువురు విద్యార్థినులు శిక్షణ కొనసాగిస్తుండడంతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం గంట పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు హాజరవుతుండడంతో విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతోందని శిక్షకురాలు శ్రీలత చెబుతున్నారు. అంతేకాక శారీరక ఆరోగ్యం పెరిగి.. ఒత్తిడి దూరమవుతుందని పేర్కొన్నారు. – సత్తుపల్లిటౌన్
మూడేళ్లుగా యోగా శిక్షణ తీసుకుంటున్నా. ఈ శిక్షణతో ఉత్సాహంగా ఉండడమే కాక చదువు సైతం ఆసక్తిగా సాగుతోంది. నల్లగొండ, హైదరాబాద్, కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించా.
– కిన్నెర ఫ్రూటీ జస్విత, సత్తుపల్లి
యోగా శిక్షణకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. ఈ శిక్షణతో ఒత్తిడి తగ్గడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన 13 మంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – చీకటి శ్రీదేవి,
పీడీ, బాలికోన్నత పాఠశాల, సత్తుపల్లి
యోగా నేర్చుకోవడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తోంది. అంతేకాక మనసు ఉల్లాసంగా ఉంటోంది. కరీంనగర్, హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను.
– కె.ధనవర్ష, సత్తుపల్లి


