వృద్ధురాలి ఆవేదనకు మంత్రి స్పందన | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఆవేదనకు మంత్రి స్పందన

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

ఖమ్మంరూరల్‌: మండలంలోని గోళ్లపాడుకు చెందిన వెలుతురు భద్రమ్మ దశాబ్దాలుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదని ఈనెల 5న మంగళగూడెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికక్కడే స్పందించిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు శుక్రవారం వివాదంలో ఉన్న భూమిని పరిశీలించారు. రికార్డుల ప్రకారం సరిహద్దులను నిర్ధారించడమే కాక ఏళ్ల తరబడి సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదనే వివరాలు సేకరించారు. ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేయగానే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి పొంగులేటి ఆదేశించడం, ఉద్యోగులు రావడంతో భద్రమ్మ ఆనందం వ్యక్తం చేస్తోంది.

రేపటి మోదీ సభకు

ఖమ్మం నుంచి ప్రత్యేక రైలు

ఖమ్మం మామిళ్లగూడెం: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగే సభలో ప్రధాని మోదీ పాల్గొననుండగా, సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు ఏర్పాటుచేసినట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిల వెంకట్‌ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడారు. ఖమ్మం నుంచి ఆదివారం ఉదయం 8–30గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, రైతులు, మహిళలు, యువత రావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్‌, కోటమర్తి సుదర్శన్‌, ప్రభాకర్‌, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్‌, రజనీరెడ్డి, మంద సరస్వతి, నక్కల రవిగౌడ్‌, శ్రీరామనేని మణి పాల్గొన్నారు.

11న అప్రెంటీస్‌ మేళా

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 11వ తేదీన జాతీయ అప్రెంటీషిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఎన్‌సీ కంపెనీలు, జిల్లాలోని ఇతర కంపెనీల బాధ్యులు పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www. apprenticeshipindia. gov. in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుని, రిజిస్ట్రేషన్‌ కాపీతో ఎస్సెస్సీ, ఐటీఐ మెమోలు, కుల ధృవీకరణపత్రం, రెండు పాస్‌ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement