తిరుమలాయపాలెం: మొక్కజొన్న చేనులో వ్యర్థాలకు నిప్పు పెట్టగా సమీపంలోని వరి, జామాయిల్ పంటలకు నిప్పంటుకుని సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై బాధిత రైతుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మండలంలోని దమ్మాయిగూడెంలో వీరదాసు భాగ్యమ్మ తన మొక్కజొన్న పంట కోత అనంతరం వ్యర్థాలకు నిప్పు పెట్టింది. అయితే, గాలిదుమారంతో పక్కనే ఉన్న ఆలస్యం సత్యనారాయణ, నూకారపు నాగేశ్వరరావుకు చెందిన వరి, జామాయిల్ పంటలకు మంటలు వ్యాపించి కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.జగదీష్ తెలిపారు. కాగా, రైతులు వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు కలియదున్నాలని సూచించారు.
పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి
ఎర్రుపాలెం: ఉపాధి హామీ పథకం ద్వారా పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు తగిన వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్ ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు, పెగళ్లపాడు గ్రామాల్లో పనులతో పాటు నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన.. రోజుకు సగటున రూ.307 వచ్చేలా కొలతల ప్రకారం పనిచేయాలని తెలిపారు. ఎండల నేపథ్యాన ఉదయాన్నే పనికి రావాలని చెప్పారు. అలాగే, పని ప్రదేశాల్లో టెంట్ వేయించడంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు సమకూర్చాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సర్పంచ్‌లు సమకూర్చిన మజ్జిగ ప్యాకెట్లను కూలీలకు అందజేశారు. నర్సరీలోని ఖాళీ సంచుల్లో త్వరగా మొలకలు వచ్చే విత్తనాలు నాటా లని ఆదేశించారు. ఎంపీడీఓ బి.సురేందర్, ఏపీఓ నాగరాజు, సర్పంచ్‌లు కె.కన్నమ్మ, కె.అనిల్‌కుమార్, ఈసీ లక్ష్మయ్య, కార్యదర్శులు పాల్గొన్నారు.


