కొణిజర్ల: ప్రమాదవశాత్తు వైరా రిజర్వాయర్‌లో పడిన వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్‌ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు... వైరా మున్సిపాలిటీ పరిధి లీలా సుందరయ్యనగర్‌కు చెందిన లారీ డ్రైవర్ ఆది శివప్రసాద్(48) గురువారం రాత్రి భోజనం తర్వాత రిజర్వాయర్ ఆనకట్టపైకి వాకింగ్ కోసం వెళ్లాడు. ఈక్రమాన ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడినట్లు తెలుస్తోంది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం రిజర్వాయర్‌లో శివప్రసాద్ మృతదేహం తేలడంతో గుర్తించారు. ఆయనకు భార్య, ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. శివప్రసాద్ తండ్రి జగన్నాధం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
పెనుబల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన అనుమోలు రమేష్(52) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆన శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు పెనుబల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు.


