తాజాగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో
నామినేటెడ్ పదవుల భర్తీ
కొందరు ఉమ్మడి జిల్లా వాసులకు
అవకాశం
ఏళ్లుగా ఎదురుచూసినా పలువురికి మాత్రం నిరాశ
ఇప్పట్లో మళ్లీ భర్తీ ఉండదనే
ప్రచారంతో నిరుత్సాహం
ముఖ్య నేతల్లో నైరాశ్యం..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నారని ఉత్సాహంతో ఎదురుచూసిన అధికార పార్టీలోని కొందరు ఆశావహులకు భంగపాటు తప్పలేదు. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు బుధవారం చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించగా జిల్లాలో కొందరికి అవకాశం దక్కినప్పటికీ.. చివరి వరకు ప్రయత్నించినా పలువురు నేతలకు మాత్రం భంగపాటు ఎదురైంది. పార్టీలో ముఖ్యనేతలుగా చెలామణి అయిన వారిని పదవులు వరించకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తుండడం, ఇప్పట్లో మరోమారు పదవుల భర్తీ చేపట్టకపోవచ్చనే ప్రచారంతో వారిలో ఆవేదన అలుముకుంది.
ముమ్మర ప్రయత్నాలు
కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్ల తర్వాత 2023లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పలువురు తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించింది. కొందరు నేతలకు తొలి దఫా భర్తీలోనే చోటు లభించింది. ఇంకొందరు ముఖ్యనేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లతోపాటు జిల్లాస్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతులు అందజేశారు. పండుగలు, వివిధ ఎన్నికల సమయాల్లో పదవులు భర్తీ అంశంపై తెరపైకి వచ్చినా ఆ తర్వాత మరుగున పడడం సాధారణమైపోయింది. అయినా పదవులను ఆశించిన నేతలు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగించారు.
జిల్లాకు ప్రాధాన్యత దక్కినా...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రతీసారి ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. గత ఎన్నికల్లో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో 2024లో జరిగిన పదవుల భర్తీ సమయాన ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఆతర్వాత ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలను ఏర్పాటు చేశారు. ఇక బుధవారం ప్రకటించిన పదవుల్లోనూ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో జిల్లాకు చెందిన నేతలకు చైర్మన్లు, వైస్‌చైర్మన్లుగా అవకాశం దక్కింది. ఇదేసమయాన జిల్లాస్థాయిలో సుడా, గ్రంథాలయ సంస్థ చైర్మన్లను సైతం నియమించారు.
ఇదే ఆఖరా ?
ఉమ్మడి జిల్లాలోని నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను దక్కించుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. అలాకాని పక్షంలో జిల్లా స్థాయి చైర్మన్ పదవులైనా వస్తే సర్దుకోవాలని భావించారు. కానీ చాలామందికి అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు రెండుసార్లు పదవులు భర్తీ చేయగా.. ఇంకోసారి పదవులు భర్తీ చేయాలంటే కొంత సమయం పడుతుందనే చర్చ నేపథ్యాన స్థానాలు దక్కని నేతలు తమ పరిస్థితి ఏమిటనే అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ కొందరు నేతలు నామినేటెడ్ పదవులపై ఆశతో పోటీకి దిగలేదు. వీరు కూడా తాము నమ్ముకుని నేతలను కలిసి పదవులపై ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరినీ సంతృప్తి పర్చలేకపోయినట్లు ముఖ్యనేతలు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
నామినేటెడ్ పదవుల భర్తీలో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కినా.. పదవులు ఆశించిన కొందరు ప్రధాన నేతలకు చుక్కెదురైంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వారు, ఎన్నికల ముందు, తర్వాత పార్టీలో చేరిన నాయకులు నామినేటెడ్ పదవులను ఆశించారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులుగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఆశలు ఫలించలేదు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఎన్నికల్లో శ్రమించిన నేతలు గుర్తింపు కలిగిన నామినేటెడ్ పదవులను ఆశించి మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదనే నైరాశ్యం నెలకొంది.


