● వైద్యులు సమయపాలన పాటించాలి ● వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో కలెక్టర్ దివాకర
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే కాక పరిపాలన అంశాలపైనా వైద్యులు దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, చికిత్సకు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తిస్తే ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో పనిచేయని యంత్రాల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా పీహెచ్‌సీ స్థాయిలో అవసరమైన పరీక్షా సామగ్రి అందుబాటులో ఉంచాలని, ప్రతీ గర్భిణీకి పరీక్షలు చేసేలా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు లక్ష్యాలు నిర్దేశించాలని చెప్పారు. అలాగే, 14 – 15 వయస్సు బాలికలకు వ్యాక్సిన్ వేయించేలా తల్లిదండ్రులను అవగాహన కల్పించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో అవసరమైన మరమ్మతులు, ఫర్నీచర్ కోసం గురువారం నాటికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ రామారావు, అదనపు డీఎంహెచ్‌ఓ చందునాయక్, పీఓలు అరుణాదేవి, ఐ.మోత్యా, డీఐఓ పి.సంపత్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తి చేయండి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు నాణ్యతగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని 15 జూనియర్ కళాశాలల్లో మరమ్మతులు, అమ్మ ఆదర్శ పాఠశాల్లో జరుగుతున్న పనులపై నివేదిక అందించాలని చెప్పారు. తిరుమలాయపాలెంలో 30 పడకల ఆస్పత్రి 50 పడకలకు విస్తరణ, వంద పడకల ఆస్పత్రుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, భవిత కేంద్రాలు, వైరా జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు, కేజీబీవీల్లో పనులపై కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీఆర్ ఎస్‌ఈ వై.వెంకట్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ ఎం.యాకోబు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ బుగ్గయ్య పాల్గొన్నారు.


