ఇకపై ఫోర్లు.. సిక్స్‌లే! | - | Sakshi
Sakshi News home page

ఇకపై ఫోర్లు.. సిక్స్‌లే!

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

ఖమ్మం స్పోర్ట్స్‌/ఖమ్మం రూరల్‌: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా శిక్షణ కోసం పటేల్‌ స్టేడియంలోని నెట్స్‌ తప్ప సరైన సదుపాయాలు లేక.. మ్యాచ్‌ల నిర్వహణకు సరిపడా మైదానాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది శుభవార్త! జిల్లా కేంద్రానికి సమీపాన క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా.. సాధ్యాసాధ్యాలపై ఖమ్మం లోక్‌సభ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి దృష్టి సారించారు. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ బాధ్యుల వినతితో ఆయన గురువారం రఘునాథపాలెం మండలం జింకల తండా, ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు హైవే వెంట స్థలాలను పరిశీలించారు. స్టేడియం నిర్మాణానికి ఎంత స్థలం అవసరం, ఎక్కడెకక్కడ అనువైన స్థలాలు ఉన్నాయనే అంశంపై మ్యాప్‌ల ఆధారంగా ఆరా తీశారు. ఔత్సాహిక క్రికెటర్ల కలలను సాకారం చేసేలా క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ వెల్లడించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌ తహసీల్దార్లు ఎస్‌.శ్వేత, విజయేందర్‌రెడ్డి, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, గతంలో బాలపేట వద్ద క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు 20ఎకరాల స్థలం కేటాయించినట్లు ప్రకటించారు. మరోమారు ఎంపీ స్టేడియం నిర్మాణానికి స్థలాలు పరిశీలించడంతో క్రీడాకారులు ఆశలు చిగురిస్తున్నాయి.

క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు

ఎంపీ రఘురాంరెడ్డి పరిశీలన

Advertisement
 
Advertisement
Advertisement